జార్జి ఫ్లాయిడ్‌ కుటుంబానికి 196 కోట్ల పరిహరం

14 Mar, 2021 05:47 IST|Sakshi

మినియాపొలిస్‌: అమెరికాలో తీవ్ర అలజడులకు, నిరసనలకు కారణమైన జార్జి ఫ్లాయిడ్‌ మరణ ఉదంతంలో మరో పరిణామం చోటుచేసుకుంది. నల్లజాతీయుడైన బాధితుడి కుటుంబానికి 27 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.196 కోట్లు) భారీ మొత్తాన్ని పరిహారంగా చెల్లించేందుకు మినియాపొలిస్‌ నగర కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.  ఫ్లాయిడ్‌ కుటుంబ న్యాయవాది బెన్‌ క్రంప్‌ తాజా పరిణామంపై స్పందిస్తూ.. కేసు విచారణకు ముందు జరిగిన అతి పెద్ద సెటిల్‌మెంట్‌ ఇదేనన్నారు. ఈ సెటిల్‌మెంట్‌కు ఫ్లాయిడ్‌ కుటుంబం ఒప్పుకుందని కూడా ఆయన చెప్పారు.  ఫ్లాయిడ్‌ మృతికి కారకులైన చౌవిన్, ఇతర మాజీ పోలీసులపై కోర్టులో కొనసాగుతున్న విచారణకు ఈ పరిణామానికి ఎలాంటి సంబంధం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. 2020 మే 25వ తేదీన డెరెక్‌ చౌవిన్‌ అనే పోలీసు అధికారి అనుమానంతో జార్జిఫ్లాయిడ్‌ను కిందపడేసి మెడపై తొమ్మిది నిమిషాల పాటు మోకాలితో నొక్కి ఉంచడంతో ఊపిరాడక చనిపోయిన ఘటన  అమెరికాలో ఆగ్రహ జ్వాలకు కారణమైంది. 

మరిన్ని వార్తలు