George Floyd Case: డెరిక్ అమాయకుండంటూ తల్లి.. ఫ్లాయిడ్‌ను గుర్తు చేసుకుని ఏడ్చిన చిన్నారి

26 Jun, 2021 10:03 IST|Sakshi

సంచలనం సృష్టించిన జార్జ్‌ ఫ్లాయిడ్(46) హత్య ఉదంతంలో ఎట్టకేలకు న్యాయం జరిగింది. మెడను కాలితో నొక్కిపట్టి ఊపిరి ఆడకుండా చేసి అతడి మరణానికి కారణమైన పోలీస్‌ మాజీ అధికారి డెరిక్ చౌవిన్‌ (45)కు కఠిన శిక్ష విధించింది కోర్టు. డెరిక్‌ను ఇదివరకే దోషిగా నిర్ధారించిన మిన్నియపొలిస్‌ కోర్టు గత రాత్రి అతడికి శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. మొత్తం ఇరవై రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది.

పోయినేడాది మే 25న జార్జ్‌ ఫ్లాయిడ్‌ను నడిరోడ్డుపై డెరిక్ చౌవిన్ మోకాలితో నొక్కి అదిమిపట్టాడు. తనకు ఊపిరి ఆడడం లేదని, కాలు తీయాలని ఫ్లాయిడ్ వేడుకున్నా డెరిక్ కనికరించలేదు. ఆ తర్వాత ఫ్లాయిడ్‌ను ఆసుపత్రికి తరలించగా మరణించాడు. ఇందుకు సంబంధించి వీడియోలు, పొటోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ‘భావోద్వేగంలోనో లేదంటే సానుభూతితోనో డెరిక్‌కు ఈ శిక్ష విధించడం లేదు’ అని తీర్పు సందర్భంగా జడ్జి పీటర్‌ కాహిల్‌ ప్రకటించారు.

కాగా, తీర్పు వెలువరించే ముందు డెరిక్‌.. లేచి నిలబడి ఫ్లాయిడ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించాడు. సూటిగా జడ్జి కళ్లలోకి చూసి మాట్లాడకపోగా.. ఆ ఒక్కముక్క మాట్లాడి వెంటనే కూర్చున్నాడు. ఇక డెరిక్‌ తల్లి వ్యవహారంపై పలువురు మండిపడుతున్నారు. తన కొడుకు అమాయకుడంటూ, ఫ్లాయిడ్‌ హత్యలో అనవసరంగా ఇరికించారంటూ ఆమె కంటతడితో స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. మరోవైపు ఫ్లాయిడ్‌ కుటుంబం తరపున అతని ఏడేళ్ల కూతురు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ మాట్లాడిన మాటల్ని రికార్డుగా కోర్టు పరిగణలోకి తీసుకుంది.  తీర్పు తర్వాత ప్రెసిడెంట్‌ బైడెన్‌ సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు స్పందించారు.

ఫేక్‌ డాలర్‌ నోట్ల అనుమానంతో డెరిక్‌, అతని ముగ్గురు సహాచర అధికారులు జార్జ్‌ ఫ్లాయిడ్‌ను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని తరలించే క్రమంలో క్రూరంగా వ్యవహరించగా.. ప్రాణాలు కోల్పోయాడు. జాత్యాహంకార హత్యగా ఇది ప్రపంచాన్ని కుదిపేసింది. కాగా, ఈ ఘటనను డార్నెల్లా ఫ్రాజెయిర్‌ అనే అమ్మాయికి ఈ ఏడాది పులిట్జర్‌ గౌరవ పురస్కారం దక్కింది కూడా. కాగా, అమెరికాలో పోలీసుల చేతిలో హత్యలకు గురైన ఉదంతాలు తక్కువేం కాదు. ఫ్లాయిడ్‌ ఉదంతం నాటికి 1,129 మంది పౌరులు, పోలీసుల చేతిలో చంపబడ్డారని నివేదికలు వెల్లడించాయి కూడా.

చదవండి: నాన్న ఫ్లాయిడ్‌ ప్రపంచాన్నే మార్చేశాడు!

మరిన్ని వార్తలు