రష్యా చమురు కొనుగోలుపై భారత్‌ని నిందించలేం! జర్మనీ

22 Feb, 2023 21:36 IST|Sakshi

రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తున్న భారత్‌ గురించి జర్మన్‌ రాయబారి ఫిలప్‌ అకెర్‌మాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం గురించి భారత్‌ని నిందించలేనని స్పష్టం చేశారు. రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీ అనుసరిస్తున్న విధానం సౌకర్యవంతంగా ఉందని యూఎస్‌ చెప్పిన కొద్ది వారాల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం విషయమై భారత్‌ని విమర్శించలేను, అది మాకు అనవసరమైన విషయం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయం దీనిలో తాము జోక్యం చేసుకోమని తెగేసి చెప్పారు. అంతేగాదు ఉక్రెయిన్‌ రష్యా యుద్ధాన్ని ఆపగలిగే తగిన అభ్యర్థి భారతేనని, దానికి ఆ నైపుణ్యం, దౌత్యం ఉన్నాయని జర్మన్‌ రాయబారి అకెర్‌ మాన్‌ అన్నారు.

ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన తర్వాత నుంచి పాశ్చాత్య దేశాలు రష్యా చమురు కొనుగోలును తగ్గించాయి. కానీ చైనా, యూఎస్‌ తర్వాత ప్రపంచంలో మూడవ అతి పెద్ద ముడి చమురు దిగుమతి దారు అయిన భారత్‌ మాత్రం రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నా.. మంచి డీల్‌ లభించిన చోట చమురు కొనుగోలు చేస్తూనే ఉంటామని కరాఖండీగా చెప్పింది. ఐతే రష్యా చమురుపై పరిమితి విధించిన జీ7 దేశాలకు మద్దతివ్వకుండా భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది.

భారత్‌లో రష్యన్ ‌చమురు దిగుమతులు జనవరిలో రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల బారెళ్లకు చేరాయి. మాస్కో ఇప్పటికి న్యూఢిల్లీకి చమురు అమ్మకందారుగా ఉంది. దీంతో భారత్‌లో రిఫైనర్‌లు రష్యా కీలక చమురు క్లయింట్‌గా ఉద్భవించాయి. అంతేగాదు భారత్‌ ఐరోపా, యూఎస్‌ కోసం ఇంధనాన్ని శుద్ధి చేస్తోంది కూడా. ఐతే శుద్ధి చేసిన ఇంధనం రష్యన్‌కి చెందినదిగా పరిగణించబడదు. అదీగాక ముడి చమురును సాధ్యమైనంత వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయడం కోసం రష్యాతో భారత్‌ కఠినమైన భేరాన్నే కుదుర్చుకుంది. దీంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని..ఇంధన భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో వాషింగ్టన్‌ న్యూఢిల్లీతో సౌకర్యవంతంగా ఉందని బైడెన్‌ పరిపాలనాధికారి తెలిపారు. 

(చదవండి: బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్‌లో పరిణామాలపై బ్రిటన్‌ స్పందన)

మరిన్ని వార్తలు