చచ్చుబడిన కాళ్లలో మళ్లీ చైతన్యం

19 Jan, 2021 08:28 IST|Sakshi

ఒక ఇంజక్షన్‌తో కొన్ని వారాల్లోనే కదలికలు

మరిన్ని ప్రయోగాల తరువాతే మానవులకు?

డిజైనర్‌ ప్రొటీన్‌ రూపొందించిన జర్మనీ శాస్త్రవేత్తలు

ఎలుకల్లో విజయవంతంగా ప్రయోగాలు

సాక్షి, హైదరాబాద్‌: వెన్నెముక గాయాలతో శరీరం దిగువభాగం, ముఖ్యంగా కాళ్లు చచ్చుబడిపోయిన వారికి శుభవార్త. జర్మనీలోని రుహర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని.. కాళ్లు చచ్చుబడిన ఎలుకలు ఒక్క ఇంజక్షన్‌తోనే మూడు వారాల్లో మళ్లీ నడవగలిగాయి. అద్భుతం అనేందుకు ఏమాత్రం తీసిపోని ఈ పరిశోధనకు కీలకం.. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ప్రొటీన్‌! హైపర్‌ ఇంటర్‌ల్యూకిన్‌–6 (హెచ్‌ఐఎల్‌–6) అని పిలిచే ఈ ప్రొటీన్‌ నాడీ కణాల పునరుత్పత్తికి అవసరమైన సంకేతాలు అందిస్తుంది. వాస్తవానికి ఈ ప్రొటీన్లు శరీరంలోనే ఉన్నప్పటికీ వాటికి ఈ సామర్థ్యం ఉండదు. రుహర్‌ శాస్త్రవేత్తలు ఈ ప్రొటీన్‌ను కృత్రిమంగా డిజైన్‌ చేసి, అభివృద్ధి చేయడమే కాకుండా.. దాన్ని ఓ సాధారణ వైరస్‌ సాయంతో ఎలుకల మెదళ్లలోకి జొప్పించారు. వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్న ఈ ఎలుకలకు ప్రొటీన్‌ అందించినప్పుడు ఇంజక్షన్‌ ఇచ్చిన సెన్సరీ కార్టెక్స్‌ ప్రాంతంలో మోటార్‌ ఆక్సాన్ల (కదలికలకు సంబంధించిన సంకేతాలు ఇచ్చేవి) ఉత్పత్తి మొదలైంది.

 అంతేకాదు.. ఈ ఉత్పత్తి వెన్నెముక ప్రాంతంలోనికీ విస్తరించింది. నడకకు అవసరమైన భాగాలను చైతన్యం చేసింది. ఫలితంగా చచ్చుబడిన కాళ్లలో కొన్ని వారాల వ్యవధిలోనే కదలికలు వచ్చాయి. శరీరం దిగువభాగం చచ్చుబడిన ఎలుకల్లో రెండు మూడు వారాల్లోనే తాము కదలికలు చూశామని, ఇప్పటివరకూ ఇలా ఎప్పుడూ జరగలేదని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త దైమర్‌ ఫిషర్‌ తెలిపారు. వెన్నెముక గాయమైన కొన్ని వారాల తరువాత ఈ చికిత్స అందిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, వాటి ఆధారంగా మనుషులకూ ఈ చికిత్స విధానం విస్తరించడంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. పరిశోధన ఫలితాలు నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

అసాధ్యాన్ని సాధించారు...
వెన్నెముక గాయాల కారణంగా శరీరం దిగువ భాగం చచ్చుబడడాన్ని మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. వెన్నెముక నుంచి మెదడుకు మధ్య సంకేతాల ఆదాన ప్రదానాలు నిలిచిపోవడం దీనికి కారణం. వెన్నెముకలోని నాడీ పోగులు (ఆక్సాన్లు) సమాచారాన్ని అటూ ఇటూ చేరవేస్తాయనేది తెలిసిందే. ఆక్సాన్లు దెబ్బతింటే శరీర భాగాలకు, మెదడుకు మధ్య సంబంధం తెగిపోతుందన్నమాట. ఒకసారి దెబ్బతిన్న ఆక్సాన్లు మళ్లీ పెరగవు కాబట్టి బాధితులు జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెన్నెముకను సరిచేసి, తద్వారా చచ్చుబడిన శరీర భాగం మళ్లీ చైతన్యవంతమయ్యేలా చేయడం ఇప్పటివరకూ అసాధ్యంగానే మిగిలింది. విద్యుత్తు ప్రచోదనాల ద్వారా చికిత్స చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా సాధించిన ఫలితాలు అంతంతే. వెన్నెముక గాయమైన ప్రాంతాన్ని తప్పించి మిగిలిన నాడులను ఉత్తేజపరిచేలా చేసేందుకూ విఫలయత్నాలు జరిగాయి. రుహర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ రెండు పద్ధతులనూ కాదని జన్యుమార్పిడితో ప్రయత్నించి విజయం సాధించడం విశేషం. వీరు తయారు చేసిన హెచ్‌ఐఎల్‌–6 డిజైనర్‌ ప్రొటీన్‌ కేవలం కదలికలకు సంబంధించిన నాడీ కణాలపై మాత్రమే కాకుండా.. చూపునకు సంబంధించిన కణాలపైనా సానుకూల ప్రభావం చూపగలవని ఇప్పటికే రుజువైంది. అంటే అంధులకు మళ్లీ చూపునిచ్చేందుకూ ఈ ప్రొటీన్లను ఉపయోగించే అవకాశం ఉందన్నమాట.
 

మరిన్ని వార్తలు