ఈ యాంటీబాడీలతో కరోనా వైరస్‌ ఫట్‌!

26 Sep, 2020 02:05 IST|Sakshi

బెర్లిన్‌: కరోనా వైరస్‌పై అత్యధిక సామర్థ్యంతో పనిచేయగల యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ యాంటీబాడీలతో కోవిడ్‌ వైరస్‌ నియంత్రణకు పరోక్ష టీకాను తయారు చేయవచ్చునని అంచనా. ప్రస్తుతం వేర్వేరు కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీకా శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించిన యాంటీబాడీల ద్వారా తయారయ్యే టీకా నేరుగా శరీరంలోకి ప్రవేశించి వైరస్‌ను అడ్డుకుంటుంది.  ‘సెల్‌’జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం కొన్ని కరోనా వైరస్‌ యాంటీబాడీలు వేర్వేరు అవయవాల తాలూకూ కణజాలానికి అతుక్కుపోతాయి. ఫలితంగా అనవసరమైన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది.

జర్మన్‌ సెంటర్‌ ఫర్‌ న్యూరో డీజనరేటివ్‌ డిసీజెస్‌ శాస్త్రవేత్తలు సుమారు 600 యాంటీబాడీలను రోగుల నుంచి సేకరించి పరిశోధనలు చేపట్టా్టరు. వీటిల్లో వైరస్‌కు బాగా అతుక్కుపోగల వాటిని కొన్నింటిని గుర్తించారు. పోషక ద్రావణాల సాయంతో ఈ యాంటీబాడీలను కృత్రిమంగా వృద్ధి చేసి ప్రయోగించినప్పుడు వైరస్‌ కణంలోకి ప్రవేశించడం అసాధ్యంగా మారుతుందని తెలిసింది. దీంతోపాటు వైరస్‌ నకళ్లు ఏర్పరచుకోవడం కూడా వీలు కాదు. యాంటీబాడీలు వైరస్‌ను గుర్తిస్తున్న కారణంగా రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు కూడా వీటిపై దాడి చేసేందుకు వీలేర్పడుతుంది. జంతు ప్రయోగాల్లో ఈ యాంటీబాడీలు బాగా పనిచేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ యాంటీబాడీలు మిగిలిన వాటికంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఇవి చికిత్స, రక్షణలు రెండింటికీ ఉపయోగించవచ్చునని వివరించారు.

మరిన్ని వార్తలు