గ్యాస్‌ ప్రాజెక్టు నుంచి వైదొలగాలని జర్మనీపై ఒత్తిడి

3 Sep, 2020 19:25 IST|Sakshi

అలెక్సీ నవాల్నీపై హత్యాయత్నం : రష్యాపై ఆగ్రహం

బెర్లిన్‌ : రష్యా నుంచి జర్మనీకి గ్యాస్‌ను తరలించే నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌ ప్రాజెక్టును నిలిపివేయాలని జర్మన్‌ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. క్రెమ్లిన్‌ విమర్శకుడు అలెక్సీ నవాల్నీపై సోవియట్‌ స్టైల్‌లో విషపూరిత రసాయనాలు ఎక్కించి హత్యాయత్నం చేశారని ఆమె పేర్కొన్న అనంతరం పైప్‌లైన్‌ ప్రాజెక్టు రద్దుపై ఒత్తిళ్లు తీవ్రతరమయ్యాయి. బెర్లిన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవాల్నీపై నోవిచోక్‌ రసాయనాన్ని ప్రయోగించి హత్యాయత్నం చేశారని, దీనిపై రష్యా వివరణ ఇవ్వాలని మెర్కెల్‌ బుధవారం డిమాండ్‌ చేశారు. అయితే జర్మనీ వాదనను మాస్కో తోసిపుచ్చుతూ ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని, ఆధారాలు లేకుండా జర్మనీ ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. నవాల్నీపై దాడిని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి.

జర్మన్‌ రాజకీయ నేతలు పలువురు ఈ ఘటనపై ప్రభుత్వం కఠినంగా స్పందించాలని కోరుతున్నారు. ‘మనం రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి..రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తెలిసిన భాషలోనే మనం బదులివ్వాలి..ఆయనకు తెలిసింది గ్యాస్ విక్రయాలే’నని జర్మనీ పార‍్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్‌ నాబర్ట్‌ రాట్‌జెన్‌ అన్నారు. నార్డ్‌స్ర్టీమ్‌ 2 పైప్‌లైన్‌ ఇప్పుడు పూర్తయితే పుతిన్‌ ఈ తరహా రాజకీయాలను కొనసాగించేందుకు ప్రోత్సహించినట‍్టేనని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి నేరుగా గ్యాస్‌ను తీసుకువచ్చే ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తవగా 2021 ఆరంభంలో ప్రారంభం కానుంది. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని జర్మనీపై ఒత్తిడి పెరుగుతోంది. చదవండి : ‘నమస్తే’తో మనసులు గెలుచుకున్న రాజ్‌నాథ్‌

మరిన్ని వార్తలు