కోడి కూస్తోందని కేసు పెట్టారు

23 Aug, 2022 03:16 IST|Sakshi

ఊళ్లల్లో ఇరుగుపొరుగు మధ్య కోళ్ల పంచాయితీ కొత్తేం కాదు. కానీ ‘పక్కింటివాళ్ల కోడి వేధిస్తోంది, భరించలేకుండా ఉన్నాం బాబోయ్‌’ అంటూ కోర్టుకెక్కారు జర్మనీకి చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటా. కోడిపుంజు తెగ కూస్తూ తమను ఇబ్బందిపెడుతోందని కోర్టుకు విన్నవించుకున్నారు. కోడన్నాక కూయకుండా ఉంటుందా? ఆ మాత్రానికే కేసు పెట్టాలా అతిగాకపోతేను. అంటే.. అది కూస్తుంది పది ఇరవైసార్లు కా­దు.. రోజుకు 200 సార్లట. అది­కూడా 80 డెసిబెల్స్‌ రేంజులో.

అంటే రద్దీగా ఉన్న ఓ వీధిలో వచ్చే శబ్దం అంత అన్న­మాట. ఉదయం 8 గంటలకు మొదల­య్యే ఈ కూతల మోత... సా­యం­త్రం ఇతర కోళ్ల­తోపాటు గూట్లోకి చేరేంతవరకూ ఉంటోంది. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ గోలను భరించలేక వారు కోడిపై  కేసు పెట్టారు. ‘వాళ్లు కోడిని వదులుకోలేరు. అది ఉంటే మేం ప్రశాంతంగా నిద్ర కూడా పోలే­కపోతున్నాం. తలుపులు, కిటికీలు తీస్తే నాన్‌స్టాప్‌ చప్పుడు.

చివరకు గార్డెన్‌కూ వెళ్లలేకపోతున్నాం. అదో, మేమో తేల్చుకోవాల్సిందే’ అని అంటున్నారు. పొద్దున లేస్తే కోడిచేసే చప్పుడును రికార్డు చేసి కోర్టు ముందుంచారు. అంతేకాదు.. దాని దెబ్బకు  చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన వాళ్ల గురించి కూడా కేసులో ప్రస్తావించారు. కేసు లెమ్గో జిల్లా జడ్జి ముందుకు త్వరలో రానుంది. ఆయన తీర్పుమీదే ఈ కోడి భవిష్యత్‌ ఆధారపడి ఉందన్నమాట.   

మరిన్ని వార్తలు