దెయ్యం కోసం వెళితే పుర్రె కనపడింది

3 Mar, 2021 10:32 IST|Sakshi
దెయ్యాల కోసం అన్వేషిస్తున్న డ్యానీ దంపతులు

లండన్‌ : దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న సంగతి పక్కన పెడితే.. వాటి పెరు చెప్పుకుని లాభపడేవాళ్లు మాత్రం చాలా మందే ఉన్నారు. దెయ్యాలను చూశామని, ఆత్మలతో మాట్లాడతామని చెప్పుకుంటూ తమ అనుభవాలను క్యాష్‌ చేసుకునేవాళ్లు కూడా లేకపోలేదు. మరికొంతమంది ఓ అడుగు ముందు కేసి లైవ్‌లో దెయ్యాల్ని చూపెడతామంటూ వీడియోలతో హల్‌చల్‌ చేస్తుంటారు. ఉన్నవీ లేనివి చెప్పి.. అయినవి,కానివి చూపించి జనాలను భయపెడుతుంటారు.. కొన్ని కొన్నిసార్లు జనాల ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌కు చెందిన ఓ జంట కూడా దెయ్యాల్ని అన్వేషించే వేటలో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.

వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్, గ్రేటర్‌ మాంచెస్టర్‌లోని బోల్టన్‌కు చెందిన దెయ్యాలను అన్వేషించే డ్యానీ డఫ్పీ దంపతుల జంటకు యూట్యూబ్‌లో 1,50,000వేల మంది సబ్ స్రైబర్లు ఉన్నారు. ఈ దంపతులు తరచూ గోస్ట్‌ హంటింగ్‌( దెయ్యాలను అన్వేషించటం) పేరిట వీడియోలు తీసి తమ యూట్యూబ్‌ ఛానల్‌లో ఉంచుతుంటారు. సోమవారం అర్థరాత్రి బోల్టన్‌కు సమీపంలోని ఓ చిట్టడవి ప్రాంతంలోకి గోస్ట్‌ హంటింగ్‌ కోసం వెళ్లారు. చెట్ల మధ్య దెయ్యాల కోసం అన్వేషిస్తుండగా నేలపై ఆకుల మధ్య ఓ పుర్రె దర్శనమిచ్చింది. దాన్ని చేతుల్లోకి తీసుకున్న డ్యానీ మూడు నిమిషాల పాటు పుర్రెగురించి సుత్తి మాట్లాడాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరకున్న పోలీసులు అ పుర్రెను స్వాధీనం చేసుకున్నారు.

చేతిలో పర్రెతో డ్యానీ

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ పుర్రె ఎవరిది? అక్కడికి ఎలా వచ్చింది? ఆ వ్యక్తి మరణానికి కారణం ఏంటి? అన్న కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. తాము సాధించిన ఘన కార్యానికి సంబంధించిన వీడియోను డ్యానీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో విడుదల చేయగా.. నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ‘‘పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పుర్రెను ఎలా చేత్తో పట్టుకుంటావు’’..  ‘‘మీరు క్రైం సీన్‌ను డిస్ట్రబ్‌ చేశారు’’.. ‘‘ఎందుకు నువ్వు దాన్ని పట్టుకున్నావు.. ముట్టుకోకుండానే అది పుర్రె అని చెప్పొచ్చు..’’ అంటూ మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు