Underground Forest In China: చైనాలో మరో అద్భుతం.. ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌.. వీడియో వైరల్‌

22 May, 2022 17:27 IST|Sakshi

Giant Sinkhole in China.. ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిని కనుగొనే ప్రయత్నంలో అద్భుతాలను చూసి ఆశ‍్యర్యపోతుంటాం. ఇలాంటివి నిజంగానే ఉంటాయా అని షాక్‌ అవుతుంటాం. తాజాగా చైనాలో మరో అద్బుతం జరిగింది. భూమిలోప‌ల ద‌ట్ట‌మైన పురాత‌న అడ‌విని అన్వేషకులు ఇటీవల కనుగొన్నారు. ఈ అడవి ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దీనికి సంబంధించి.. చైనా అధికారిక మీడియా జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ ప్రాంతంలో ఒక భారీ సింక్‌ హోల్‌ బయటపడింది. అందులో అద్భుతమైన పురాతన అటవీ ప్రాంతం కూడా ఉన్నట్టు అన్వేషకులు గుర్తించారు. మే 6వ తేదీన లేయ్ కౌంటీలోని సింక్‌హోల్‌ గుహను వారు క‌నుగొన్నారు. ఈ సింక్‌హోల్ అడుగున 40 మీట‌ర్ల ఎత్తైన చెట్లున్నాయి. దీని లోపలి ప్రాంతం మొత్తం చెట్ల‌తోనే విస్త‌రించి ఉంది. ఆ చెట్ల కొమ్మ‌లు సింక్‌హోల్ పైవ‌ర‌కూ ఉన్నాయి. సింక్‌హోల్‌ 1,004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పు, 630 అడుగుల లోతుతో ఉంది. ఈ సింక్‌హోల్ ఘ‌న‌పరిమాణం 5 మిలియ‌న్ క్యుబిక్ మీట‌ర్లకు మించి ఉంది. దానిలో చెట్లు 131 అడుగుల ఎత్తులో ఉన్నాయని తెలిపారు.

కాగా, తాజాగా కనుగొన్న దానితో కలిసి చైనాలో గుర్తించిన సింక్ హోల్స్ సంఖ్య 30కి చేరింది. ఇప్పటివరకు కనిపెట్టిన అన్ని సింక్‌హోల్‌లో ఇదే పెద్ద‌ది అని అన్వేషకులు చెబుతున్నారు. ఈ సందర్బంగా గ్వాంగ్జీ అన్వేషణ బృందానికి నాయకత్వం వహించిన చెన్ లిక్సిన్ మాట్లాడుతూ.. సింక్‌హోల్‌లో ఉన్న పురాతన చెట్లు దాదాపు 40 మీటర్ల ఎత్తు (131 అడుగులు), దట్టంగా అళ్లుకుని ఉన్నారు. ఇప్పటి వరకు సైన్స్ గుర్తించని లేదా వర్ణించని జాతులు ఇందులో కనిపించే అవకాశం ఉందన్నారు. పరిశోధకులు సింక్‌హోల్ దిగువకు చేరుకోవడానికి చాలా గంటలు కాలినడక ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. మరోవైపు.. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతం అందమైన కార్ట్స్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వెళ్తుంటారు.

మరిన్ని వార్తలు