ఆ యాప్‌ ద్వారా ఖరీదైన ఫుడ్‌, లిక్కర్‌ ఫ్రీ.. ఎగబడిన జనం!

10 Jul, 2022 16:59 IST|Sakshi

వాషింగ్టన్‌: ఆఫర్‌లో తక్కువ ధరకే ఏదైనా వస్తువు వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. అలాంటిది ఉచితంగా ఆహారం, మందు వస్తుంటే ఊరుకుంటారా? ఓ యాప్‌ ద్వారా ఉచితంగా ఫుడ్‌, లిక్కర్‌ వస్తోందని తెలుసుకుని వందల మంది ఆర్డర్‌ చేశారు. క్షణాల్లోనే కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు రావటంతో నిర్వహకులు అవాక్కయ్యారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. డోర్‌డాష్‌ అనే ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ఈ సంఘటన ఎదురైంది. ఆ యాప్‌లో పేమెంట్‌ గేట్‍వే లేకుండానే ఆర్డర్లు బుక‍్కయ్యాయి.

ఈ ఆఫర్‌ తెలుసుకున్న పలువురు ఆర్డర్‌ చేయటమే కాదు.. తాము ఉచితంగా పొందామని తమ ఆర్డర్‌ చిత్రాలను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారు. అందులో టెకిలా వంటి అత్యంత ఖరీదైనవి సైతం ఉండటం గమనార్హం. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికి డోర్‌డాష్‌ యాప్‌ ట్విట్టర్‌లో ట్రెడింగ్‌లోకి వచ్చింది. అయితే.. ఈ సమయంలో ఎంత మంది పేమెంట్‌ లేకుండా ఆర్డర్‌ చేశారనేది మాత్రం తెలియరాలేదు. 

అయితే.. అలాంటి ఆర్డర్లను తొలగిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలపటం ఉచితంగా ఆహారం, మందు పొందాలనుకున్న వారిని నిరాశకు గురి చేసింది. 'జులై 7న సాయంత్రం డోర్‌డాష్‌ యాప్‌లో పేమెంట్‌ సమస్య తలెత్తింది. ఆ తర్వాత కొద్ది సేపు ఎలాంటి పేమెంట్‌ లేకుండానే పలువురు యూజర్లు ఆర్డర్‌ బుక్‌ చేయగలిగారు. అలా కొందరు వినియోగదారులు ఆర్డర్‌ చేశారని తెలుసుకుని.. వెంటనే సమస్యను పరిష్కరించాం.' అని డోర్‌డాష్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన‍్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు

మరిన్ని వార్తలు