కరోనాని కట్టడి చేయకపోతే.. 20 లక్షల మంది బలి

27 Sep, 2020 03:05 IST|Sakshi

డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

జెనీవా: కరోనా వైరస్‌ కట్టడికి ప్రపంచ దేశాలు కలసికట్టుగా యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. కరోనా వైరస్‌ చైనాలో వూహాన్‌లో ప్రబలిన తొమ్మిది నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలతో పాటు పౌరులు వ్యక్తిగత స్థాయిలో కరోనాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతోందన్న సూచనలు ఎక్కడా లేవని అభిప్రాయపడ్డారు.

సింగిల్‌ డోసుతో యాంటీబాడీస్‌
ఒకే ఒక్క డోసుతో కోవిడ్‌ నుంచి రక్షణ కోసం అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌తో ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయి. ఏడీ26, కావ్‌2 ఎస్‌ అనే ఈ వ్యాక్సిన్‌తో యాంటీ బాడీలు అత్యధికంగా ఉత్పత్తి అయినట్టుగా ఆ సంస్థ తన మధ్యంతర నివేదికలో వెల్లడించింది. కరోనా నుంచి రక్షణ పొందాలంటే ఇప్పటివరకు అభివృద్ధిలో ఉన్న వ్యాక్సిన్‌లన్నీ రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పంపిణీని సులభతరం చేయడానికి ఒకే డోసుతో ప్రయోగాలు చేస్తోంది. అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ వంటి దేశాలకు చెందిన 60 వేల మందికి ఈ వ్యాక్సిన్‌ డోసుల్ని ఇస్తున్నట్టుగా సంస్థ వెల్లడించింది.  

ఇష్టారాజ్యంగా చైనా వ్యాక్సిన్‌ వినియోగం
కరోనా వ్యాక్సిన్‌ను చైనా అత్యవసరంగా అందుబాటులోకి తెచ్చి ఇష్టారాజ్యంగా రెండో డోసుల్ని ఇచ్చేస్తోంది. దీంతో చైనాలో ప్రజలపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి. శాస్త్రవేత్తల  ఆందోళనల్ని లెక్క చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థ సినోఫార్మ్‌ ఇప్పటికే 3 లక్షల 50 వేల మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరో కంపెనీ సినోవాక్‌ తమ ఉద్యోగుల్లో 90శాతం మందికి బలవంతంగా వ్యాక్సిన్‌లు ఇచ్చింది.

మరిన్ని వార్తలు