మూడేళ్లలో 60 లక్షల మరణాలు

8 Mar, 2022 03:51 IST|Sakshi

కరోనా విధ్వంసంపై జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలు

బ్యాంకాక్‌: కోవిడ్‌–19 ప్రబలిన మూడేళ్లలో ప్రపంచదేశాల్లో 60 లక్షల మందిని బలితీసుకుంది. ఇప్పటికీ వైరస్‌ తీవ్రతతో చాలా దేశాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. మాస్క్‌ ధరించడం మానేసి, ప్రయాణాలు, వ్యాపారాలు తిరిగి మొదలైనా ఈ మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉందని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ పేర్కొంది. గత నాలుగు నెలల్లోనే 10 లక్షల కోవిడ్‌ మరణాలు నమోదైనట్లు తెలిపింది. ఇప్పటి వరకు వైరస్‌ సోకని పసిఫిక్‌ ద్వీపాల్లో సైతం మొదటి వేవ్‌ ప్రజలను వణికిస్తోంది.

హాంకాంగ్‌ ప్రభుత్వం ఈ ఒక్క నెలలోనే మొత్తం 75 లక్షల మంది ప్రజలకు మూడు పర్యాయాలు కరోనా పరీక్షలు జరిపింది. అయినప్పటికీ అక్కడ రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 10 లక్షల మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 45 కోట్ల మంది కోవిడ్‌ బారినపడినట్లు లెక్కలు తేల్చింది. అయితే, కోవిడ్‌తో 1.40 కోట్ల నుంచి 2.35 కోట్ల మంది మరణించినట్లు ‘ది ఎకనామిస్ట్‌’విశ్లేషకుల అంచనా.

చైనాలో మళ్లీ కోవిడ్‌
చైనా ప్రభుత్వం కోవిడ్‌–19 వ్యాప్తిని నిరోధించేందుకు అత్యంత కఠినమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు కొత్తగా బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో సోమవారం ఒక్క రోజు వ్యవధిలో వెలుగు చూసిన 214 కొత్త కేసుల్లో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులో 69, జిలిన్‌లో 54, షాడోంగ్‌ ప్రావిన్స్‌లో 46 నిర్ధారణ అయినట్లు ప్రధాని లీ కెకియాంగ్‌ తాజాగా నేషనల్‌ లెజిస్లేచర్‌కు అందజేసిన వార్షిక నివేదికలో తెలిపారు. 2019లో వూహాన్‌లో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్‌ జాడలు వెలుగుచూశాక ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

దేశ రాజధాని బీజింగ్‌లో కొత్తగా కేసులు రానప్పటికీ మాస్క్‌ తప్పనిసరి చేశారు. కోవిడ్‌ వ్యాప్తిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. స్వల్పసంఖ్యలో కేసులు బయటపడిన చోట్ల కూడా క్వారంటైన్, లాక్‌డౌన్‌లను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. బీజింగ్‌లోని ప్రముఖ బౌద్ధాలయాలు, చర్చిలు, మసీదులను జనవరి నుంచి నిరవధికంగా మూసే ఉంచారు.చైనాలో ఇప్పటి వరకు 1,11,195 కేసులు, 4,636 మరణాలు నమోదయ్యాయని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,837 మంది కోవిడ్‌తో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు