పురుగుమందుల వాడకంపై టార్గెట్లు వద్దు

18 Dec, 2022 06:25 IST|Sakshi

కాప్‌15 సదస్సులో భారత్‌

మాంట్రియల్‌: ప్రపంచవ్యాప్తంగా పంట సాగులో పురుగుమందుల వాడకాన్ని తగ్గించే క్రమంలో లక్ష్యాలు విధించడం సరికాదని భారత్‌ పేర్కొంది. పెస్టిసైడ్స్‌ వాడకంపై విచక్షణను ఆయా దేశాలకే వదిలివేయాలని సూచించింది. వ్యవసాయరంగానికి సబ్సిడీలు ఇవ్వడాన్ని సమర్థించింది. జీవ వైవిధ్యంపై కెనడాలోని మాంట్రియెల్‌లో జరుగుతున్న 15వ కాన్ఫరెన్స్‌ ఆన్‌ పార్టీస్‌(కాప్‌15) ఉన్నత స్థాయి సదస్సులో శుక్రవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ మాట్లాడారు. పురుగుమందుల వాడకం తగ్గింపు విషయంలో ప్రపంచ దేశాలపై సంఖ్యాత్మక లక్ష్యాలను విధించడం తగదన్నారు. ఆ అంశాన్ని ఆయా దేశాలకే వదిలివేయాలని అభిప్రాయపడ్డారు.

2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులకు తగ్గించాలన్న గ్లోబల్‌ బయో డైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌ లక్ష్యంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభాలో 17% భారత్‌లోనే ఉండగా, కేవలం 2.4% భూభాగం, 4% నీటి వనరులు మాత్రమే ఉన్నాయన్నారు. అయినప్పటికీ, జీవవైవిధ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నామన్నారు. ఎరువులు, పురుగుమందులు సహా వ్యవసాయ రంగంపై భారత ప్రభుత్వం ఏటా 2.2 లక్షల కోట్లను సబ్సిడీగా ఇస్తున్నట్లు ఒక అంచనా. కాప్‌15 సదస్సుకు 196 దేశాల నుంచి 20 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు