దబ్బకాయంత అదృష్టం.. బంగారు నాణేల లెక్క తప్పింది! కోట్ల రూపాయల డబ్బు..

10 Oct, 2022 20:06 IST|Sakshi

అదృష్టం ఆవగింజంత, దురదృష్టం దబ్బకాయంత అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, యూకేలోని ఓ కుటుంబానికి మాత్రం అది వర్తించలేదు. వారికి అదృష్టం కూడా దబ్బకాయంత పట్టుకుంది. పదేళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇంటిలో భారీ ఎత్తున బంగారు నాణేలు లభించిన వార్త సెప్టెంబరు నెలలో చదివే ఉంటారు! తాజాగా ఆ వార్త తాలూకు మరో విషయం వైరల్‌గా మారింది. ఇంటి వంటగదిలో మరమ్మతులు చేస్తుండగా క్రీ.శ.1700 ప్రారంభ కాలానికి చెందిన 254 గోల్డ్‌ కాయిన్స్‌ బయల్పడిన సంగతి తెలిసిందే.

అయితే, వాటిని అమ్మితే సుమారు రూ.2.3 కోట్లు (2,50,000 యూకే పౌండ్లు) రావొచ్చని అంచనావేశారు. కానీ, ఆ అంచనా తప్పయింది. అంతకు మూడింతలు అంటే సుమారు రూ.7 కోట్లు ఆ సంపద ధర పలికిందని లండన్‌కు చెందిన వేలం సంస్థ స్పింక్‌ అండ్‌ సన్‌ ప్రతినిధి గ్రెగరీ ఎడ్‌మండ్‌ తెలిపారు. ఫెర్న్‌లీ-మాయిస్టర్స్‌ కాలానికి చెందిన నాణేలు కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు.

292 ఏళ్ల పూర్వ కాలానికి చెందిన ఈ సంపదను చేజిక్కిచ్చుకునేందుకు ప్రపంచంలోని చాలామంది ఔత్సాహికులు పోటీ పడ్డారని ఆయన వెల్లడించారు. ముందుగా అనుకున్నదానికంటే మూడు రెట్లు అధికంగా ధర రావడం ఇంతకుముందెప్పుడూ చూడలేదని అన్నారు. కాగా, పాతకాలానికి చెందిన ఆ బంగారు సంపదను  చిన్న మొత్తాల్లో విక్రయించారని మెట్రో నివేదిక పేర్కొంది.
(చదవండి: ఆస్కార్‌ లెవల్‌ యాక్టింగ్‌.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!)

మరిన్ని వార్తలు