ఆ కొండంతా బంగారం.. ఎగబడ్డ జనం

7 Mar, 2021 14:01 IST|Sakshi
వీడియో దృశ్యాలు

కిన్షాసా : డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగోలో తాజాగా ఓ బంగారు కొండ వెలుగుచూసింది. దాన్ని తవ్విన కొద్ది బంగారం బయటపడుతోంది. సౌత్‌ కివు ప్రావిన్స్‌, లుహిహిలో ఉన్న ఈ కొండ మీదకు జనం ఎగబడ్డారు. చేతికి దొరికిన వస్తువుతో మట్టి తవ్వి సంచుల్లో, పాత్రల్లో నింపుకుని వెళ్లారు. ఈ మట్టిలో 60-90శాతం బంగారం ఉన్నట్లు సమాచారం. ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ అహ్మద్‌ అల్గోభరి ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ రిపబ్లికన్‌ కాంగోలో బంగారు కొండ వెలుగుచూసింది.

జనం బంగారం కోసం ఎగబడుతున్నారు. కొండమీద మట్టిని ఇంటికి తీసుకెళ్లి, దాన్ని శుభ్రం చేసి బంగారాన్ని వెలికి తీస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బంగారు కొండపై దేశ మైనింగ్‌ శాఖ స్పందించింది. ప్రజలెవరూ ఆ కొండపై బంగారు తవ్వుకోవటానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. 

చదవండి : వైరల్‌: చేప కడుపులో తాబేలు చక్కర్లు!

గడ్డం గీయటానికి రూ. 4 లక్షల గోల్డ్‌ రేజర్‌

మరిన్ని వార్తలు