Google Doodle: గూగుల్‌లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?

3 Jul, 2021 08:39 IST|Sakshi

గొప్ప వ్యక్తులకు, మేధావులకు, సెలబ్రిటీలకు గూగుల్‌ డూడుల్‌తో గౌరవం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇవాళ(జులై 3న) ఓ జర్మన్‌ డాక్టర్‌కి గూగుడ్‌ డూడుల్‌ దర్శనమిచ్చింది. ఆయన పేరు సర్‌ లుడ్‌విగ్‌ గట్ట్‌మన్‌. న్యూరోసర్జన్‌. పారాఒలింపిక్స్‌కు ఆద్యుడు ఈయనే. అంతేకాదు జర్మనీలో నాజీల చేతిలో అవమానాలు అనుభవిస్తూనే.. వందల మంది పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాడు. ఒకానొక టైంలో హిట్లర్‌కు ఆయన మస్కా కొట్టిన తీరు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది కూడా.    

వెబ్‌డెస్క్‌: జర్మనీలోని టాస్ట్‌(ఇప్పుడది టోస్‌జెక్‌ పేరుతో పోలాండ్‌లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్‌విగ్‌. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో కోల్‌మైన్‌ యాక్సిడెంట్‌లో గాయపడ్డ ఓ వ్యక్తి తన కళ్ల ముందే మరణించడం లుడ్‌విగ్‌ మనసును కలిచివేసింది. అలా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో మెడిసిన్‌ చదవాలని నిర్ణయించుకున్నాడు. బ్రెస్లావు యూనివర్సిటీ నుంచి డాక్టర్‌ పట్టా, ఫ్రెయిబర్గ్‌ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత న్యూరోసర్జన్‌గా ఒట్‌ఫ్రిడ్‌ ఫోరెస్టర్‌ దగ్గర శిష్యరికం చేశాడు. అయితే పేదలకు ఉచితంగా సేవలు చేయాలన్న ఆయన సంకల్పం.. ఫోరెస్టర్‌కు నచ్చలేదు. దీంతో ఆయన్ని వెలేశాడు. ఆ తర్వాత నాజీలు అధికారంలోకి వచ్చాక యూదులను మెడిసిన్‌ ప్రాక్టీస్‌కు అనుమతించలేదు. దీంతో బ్రెస్లావు జూయిష్‌ ఆస్పత్రిలో సేవలందించాడు లుడ్‌విగ్‌. ఆ టైంలో నాజీల చేతిలో యూదులు బలికాకుండా ఉండేందుకు.. వాళ్లను తన ఆస్పత్రుల్లో పేషెంట్లుగా చేర్పించుకుని నాటకంతో వాళ్ల ప్రాణాలను నిలబెట్టాడు. క్రిస్టాలెనెచ్ట్‌ మారణ హోమం టైంలో గాయపడ్డ వాళ్లెవరనేది చూడకుండా ఉచిత చికిత్స అందించి మనుసున్న మంచి డాక్టర్‌గా పేరు దక్కించుకున్నాడు.

హిట్లర్‌కు మస్కా కొట్టి.. 
యూదుల సానుభూతిపరుడు అయినప్పటికీ.. వైద్యమేధావి అనే ఉద్దేశంతో హిట్లర్‌, లుడ్‌విగ్‌ గట్ట్‌మన్‌ జోలికి పోలేదు. ఆ టైంలో హిట్లర్‌ తన మిత్ర రాజ్యం పోర్చుగల్‌ నియంత అయిన అంటోనియో డె సాలాజార్‌కు చికిత్స కోసం గట్ట్‌మన్‌ను ఏరికోరి మరీ పంపించాడు. అయితే తిరుగు ప్రయాణంలో లుడ్‌విగ్‌ నాజీ సైన్యానికి మస్కా కొట్టాడు. లండన్‌లోనే తన కుటుంబంతో సహా విమానం దిగిపోయి.. యూకే శరణు వేడాడు. దీంతో యూకే ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం కల్పించింది. అక్కడే ఆయనకు 250 పౌండ్ల సాయంతో శరణార్థిగా ఉండిపోయాడు. హిట్లర్‌కు లుడ్‌విగ్‌ మస్కా కొట్టిన తీరును దాదాపు అన్ని మీడియా ఛానెళ్లన్నీ అప్పట్లో ప్రముఖంగా ప్రచురించాయి కూడా.

యుద్ధవీరుల కోసం ఆటలు
ఇక యూకే వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో సేవలందించిన లుడ్‌విగ్‌.. రెండో ప్రపంచ యుద్ధంలో లార్డ్‌ లిండ్సేకి మకాం మార్చాడు. 1943లో ప్రభుత్వ ప్రోత్సాహంతో బకింగ్‌హాంషైర్‌లో స్టోక్‌ మండ్‌విల్లే ఆస్పత్రిని నెలకొల్పాడు. ఇది వెన్నెముకలు దెబ్బతిన్న పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. ఈ సెంటర్‌కు లుడ్‌విగ్‌నే మొదటి డైరెక్టర్‌గా నియమించింది యూకేప్రభుత్వం. 1945లో గట్ట్‌మన్‌కు బ్రిటన్‌ పౌరసత్వం దక్కింది. ఆ టైంలో స్టోక్‌ మండ్‌విల్లే గేమ్స్‌ను నిర్వహించాడు లుడ్‌విగ్‌. ఈ ఈవెంట్‌లో సైన్యంలో సేవలందిస్తూ కాళ్లు, చేతులుకోల్పోయిన వాళ్లు, నడుం చచ్చుపడిపోయి వీల్‌ చైర్‌కు పరిమితమైనవాళ్లతో ఆటలు నిర్వహించాడు. విశేషం ఏంటంటే.. సరిగ్గా అదే రోజున జులై 29, 1948 లండన్‌ ఒలింపిక్స్‌ మొదలయ్యాయి. దీంతో ఈ ఆటలకు పారా ఒలింపిక్‌ గేమ్స్‌ అనే పేరు దక్కింది. అలా డిజేబిలీటీ ఉన్నవాళ్లతో ఒలింపిక్స్‌ నిర్వహించడం తర్వాతి కాలంలో క్రమం తప్పకుండా నడుస్తోంది. అందుకే లుడ్‌విగ్‌ గట్ట్‌మన్‌ను ‘ఫాదర్‌ ఆఫ్‌ పారా ఒలింపిక్స్‌’ అని పిలుస్తారు.

 

గుండెపోటుతో ఐదు నెలలు..
ఆ తర్వాత ‘ఇంటర్నేషనల్‌ స్పైనల్‌ కార్డ్‌ సొసైటీ’ని నెలకొల్పాడు గట్ట్‌మన్‌. 1966లో క్లినికల్‌ వర్క్ నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించినప్పటికీ కొన్నాళ్లపాటు ఆటగాళ్ల కోసం పని చేశాడాయన. ఆ తర్వాత హార్టికల్చర్‌తో ‘పొప్పా జీ’ అనే బిరుదు దక్కించుకున్నాడు. భారీ క్యాలిప్లవర్‌లు పండించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1979 అక్టోబర్‌లో ఆయనకు గుండెపోటు రాగా.. ఐదు నెలలపాటు ఆస్పతత్రిలో పొందుతూ.. చివరికి 1980, మార్చి18న కన్నుమూశాడు. ఆయన గౌరవార్థం.. 2012లో స్టోక్‌ మండ్‌విల్లే స్టేడియం బయట కాంస్య విగ్రహాన్ని ఉంచారు. అదే ఏడాది జరిగిన లండన్‌ పారా ఒలింపిక్స్‌ కమిటీకి ఆయనకూతురు ఎవా లోయిఫ్లెర్‌ను మేయర్‌గా నియమించారు. జర్మనీ ప్రభుత్వం ఆయనకు మెడికల్‌ సొసైటీ ప్రైజ్‌తో సత్కరించింది. రష్యా ప్రభుత్వం 2013లో స్టాంప్‌ రిలీజ్‌ చేసింది. ఇప్పుడు గూగుల్‌ 122వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో స్మరించుకుంది.
చదవండి: అంతరిక్షంలోకి తెలుగు ధీర.. శిరీష బండ్ల

మరిన్ని వార్తలు