Google Doodle: రుడాల్ఫ్‌ వెయిగ్ల్‌.. ఈ సైంటిస్ట్‌ ప్రపంచానికే హీరో!

2 Sep, 2021 10:34 IST|Sakshi

Google Doodle Rudolf Weigl: వ్యాక్సిన్‌లు.. రకరకాల జబ్బుల నుంచి మనిషికి రక్షణ అందించే కవచాలు. కరోనా తర్వాత వీటి గురించి దాదాపు పూర్తి సమాచారం అందరికీ తెలుస్తోంది. గతంలో ఎలాంటి ఎలాంటి వ్యాక్సిన్‌లు ఉండేవి, వాటిని ఎలా తయారు చేస్తున్నారు, సైడ్‌ ఎఫెక్ట్స్‌, వాక్సిన్‌లతో రక్షణ ఎలా అందుతుంది.. ఇలాంటి వివరాలన్నీ తెలిసిపోతున్నాయి. అయితే వైరస్‌, బ్యాక్టీరియాల నుంచే వాటిని అభివృద్ధి చెందిస్తారని.. అందుకు ఓ పోలాండ్‌ సైంటిస్ట్‌ చేసిన ప్రయోగాలే మూలమని మీలో ఎంతమందికి తెలుసు? .. ఇవాళ గూగుల్‌లో డూడుల్‌గా కనిపిస్తోంది కూడా ఆయనే. 


పోలాండ్‌కు చెందిన రుడాల్ఫ్‌ వెయిగ్ల్‌.. అతిపురాతనమైన, ప్రమాదకరమైన టైఫస్‌ అంటువ్యాధికి సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తయారు చేసిన మొదటి సైంటిస్ట్‌. ఈయన వ్యాక్సిన్‌ను ఎలా తయారుచేశారో తెలుసా? పేన్లను దంచి.. ఆ పేస్ట్‌తో. అవును.. వెగటుగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఈ ప్రయోగమే ఆ తర్వాతి కాలంలో చాలా వ్యాక్సిన్‌ల తయారీకి ఒక మార్గదర్శకంగా మారిందంటే అతిశయోక్తికాదు.
 
రుడాల్ఫ్‌ స్టెఫాన్‌ జన్‌ వెయిగ్ల్‌.. 1883, సెప్టెంబర్‌ 2న ఆస్స్ర్టో హంగేరియన్‌ టౌన్‌ ప్రెరవు(మోరావియా రీజియన్‌)లో పుట్టాడు. తండడ్రి టీచర్‌.. తల్లి గృహిణి. పుట్టింది జర్మనీలోనే అయినప్పటికీ పోలాండ్‌లో స్థిరపడింది ఆ కుటుంబం.

పోలాండ్‌ ఎల్‌వీవ్‌లోని యూనివర్సిటీలో బయోలాజికల్‌ సైన్స్‌ చదివాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అస్ట్రో-హంగేరియన్‌ ఆర్మీ కోసం 1914 నుంచి పారాసిటాలజిస్ట్‌గా పని చేశాడు.
 

పోలాండ్‌ను జర్మనీ ఆక్రమించుకున్నాక.. లెంబర్గ్‌ ఇనిస్టిట్యూట్‌లో రీసెర్చర్‌గా కొంతకాలం పని చేశాడు. ఆ టైంలో తూర్పు యూరప్‌లో లక్షల మంది టైఫస్‌ బారిన పడగా, దానికి వ్యాక్సిన్‌ కనిపెట్టే పనిలోకి దిగాడు. ఆపై ఎల్‌వీవ్‌లో తన పేరు మీద ఒక ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పి.. ఆపై అక్కడే టైఫస్‌ మీద, వైరల్‌ ఫీవర్‌ మీద ఆయన పరిశోధనలు మొదలయ్యాయి. 

తొలి దశ ప్రయోగాల్లో జబ్బును తగ్గించే ఫలితం రానప్పటికీ.. లక్షణాల్ని తగ్గించి ఉపశమనం ఇచ్చింది ఆయన తయారు చేసిన వ్యాక్సిన్‌. ఆ తర్వాత రాకీ మౌంటెన్‌ స్పాటెడ్‌ ఫీవర్‌కు సైతం వ్యాక్సిన్‌ తయారు చేశాడాయన.

1909లో ఛార్లెస్‌ నికోలె.. లైస్‌(పేను)వల్ల టైఫస్‌ అంటువ్యాధి ప్రబలుతుందని గుర్తించాడు. అందుకు రికెట్ట్‌సియాప్రోవాజెకి బ్యాక్టీరియా కారణమని కనిపెట్టాడు.  ఆ తర్వాత టైఫస్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. 

టైఫస్‌ వ్యాక్సిన్‌ కోసం అప్పటిదాకా ఎవరూ చేయని ప్రయోగం చేపట్టాడు వెయిగ్ల్‌. జబ్బు కారణమైన పేను కడుపులోనే రికెట్ట్‌సియా ప్రోవాజెకి ని ప్రవేశపెట్టి వాటిని పెంచి.. ఆ పేన్లను చిత్తు చేసి వ్యాక్సిన్‌ పేస్ట్‌ తయారు చేశాడు. ముందు ఆరోగ్యవంతమైన పేన్లను పన్నెండు రోజులపాటు పెంచాడు. వాటికి టైఫస్‌ బ్యాక్టీరియాను ఇంజెక్ట్‌ చేశాడు. ఆపై మరో ఐదు రోజులపాటు వాటిని పెంచాడు. చివరికి వాటిని చిత్తు(గ్రైండ్‌ చేసి).. ఆ పేస్ట్‌ను వ్యాక్సిన్‌గా ఉపయోగించాడు.

పేన్లను పెంచడానికి మనుషుల రక్తం కావాలి. కాబట్టి.. ఒక ప్రత్యేకమైన తెర ద్వారా వాటిని మనుషుల రక్తం పీల్చుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వందల మంది జబ్బు పడగా.. వాళ్లను చికిత్స ద్వారా మామూలు స్థితికి తీసుకొచ్చాడు.  1918లో గినియా పందుల మీద, మనుషుల మీద వాటిని ట్రయల్స్ నిర్వహించాడు.

1930లో వ్యాక్సిన్‌ అధికారికంగా మార్కెట్‌లోకి రిలీజ్‌ అయ్యింది. ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది.   

అయితే దేశ విద్రోహ కార్యాకలాపాలకు నెలవైందన్న ఆరోపణలతో 1944లో సోవియట్‌యూనియన్‌ ఆయన ఇనిస్టిట్యూట్‌ను మూసేసింది. 

1936-43 మధ్య చైనాలో ఈ తరహా వ్యాక్సిన్‌లను ప్రయోగించి సక్సెస్‌ అయ్యారు. కష్టం-ప్రమాదకరమైనదైనప్పటికీ.. ఆ వ్యాక్సిన్‌ ప్రయోగాలు విజవంతం అయ్యాయి.
 

1957 ఆగష్టు 11న 73 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశాడు

1942, 1978(మరణానంతరం)లో నోబెల్‌ బహుమతికి వెయిగ్ల్‌ పేరు నామినేట​అయ్యింది. కానీ, అవార్డు దక్కలేదు. అయితే ఇతర దేశస్తులతో పని చేశాడన్న ఆరోపణలు ఆయనకు అవార్డు దక్కనివ్వలేదు. 

2003లో ప్రపంచం ఆయన పరిశోధనల్ని ‘రైటస్‌ ఎమాంగ్‌ ది నేషన్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ గౌరవంతో స్మరించుకుంది.

రుడాల్ఫ్‌ వెయిగ్ల్‌ 138వ పుట్టినరోజు సందర్భంగా.. గూగుల్‌ డూడుల్‌ ద్వారా ఆయన్ని గుర్తు చేస్తోంది గూగుల్‌.

 రెండో ప్రపంచ యుద్ద సమయంలో పోలాండ్‌ను జర్మనీ ఆక్రమించుకున్నాక.. వెయిగ్ల్‌ను బలవంతంగా వ్యాక్సిన్‌ ప్రొడక్షన్‌ ప్లాంట్‌లోకి దించారు. అక్కడ ఆయన తెలివిగా పనివాళ్లను తన ప్రయోగాలకు ఉపయోగించుకున్నాడు. అంతేకాదు తనకు తాను లైస్‌ ద్వారా టైఫస్‌ను అంటిచుకుని రిస్క్‌ చేసి మరీ పరిశోధనలు చేశాడు. తన పరిశోధనలు, ప్రయోగాలతో వ్యాక్సిన్‌ను రూపొందించి.. వేల మంది ప్రాణాలు కాపాడాడిన వెయిగ్ల్‌ను ఒక సైంటిస్ట్‌గా మాత్రమే కాదు.. హీరోగా ప్రపంచం ఆయన్ని కొనియాడుకుంటోంది.

- సాక్షి, వెబ్‌ స్పెషల్‌

మరిన్ని వార్తలు