Gotabaya Rajapaksa: శ్రీలంక అధ్యక్షుడి వ్యక్తిగత పర్యటనే... మేము ఆశ్రయం ఇవ్వలేదు: సింగపూర్‌

14 Jul, 2022 19:35 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలో నిరసనకారులు ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన భార్యతో సహా మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఐతే అక్కడ కూడా గోటబయకి ఆందోళనకారుల నిరసన సెగ వదలకపోవడంతో ఆయన సింగపూర్‌ పయనమయ్యారని, అక్కడి ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందంటూ పలు వార్తలు వచ్చాయి. ఈ విషయమై సింగపూర్‌ ప్రభుత్వం స్పందించింది.

శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్‌ వచ్చారే తప్ప తాము ఆయనకు ఆశ్రయం ఇవ్వలేదని అక్కడి ప్రభుత్వ పేర్కొంది. అయినా సింగపూర్‌ సాధరణంగా ఆశ్రయం కోసం అభ్యర్థనలను మంజూరు చేయదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయన ఆశ్రయం కోరలేదని కూడా పేర్కొంది. రాజపక్స  గురువారం మధ్యాహ్నం సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానంలో సింగపూర్‌కి వచ్చినట్టు తెలిపింది.

లంక అధ్యక్షుడు గోటబయ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు వెళ్లే ముందు కొంతకాలం సింగపూర్‌లో ఉంటారని లంక అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదీగాక గోటబయ  సింగపూర్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ జెట్‌ను ఏర్పాటు చేయాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు కూడా అధికారిక వర్గాలు తెలిపాయి. ఐతే ఆయన కొలంబో బయలుదేరే ముందే రాజీనామ పంపుతానని కూడా లంక నాయకులు హామీ ఇచ్చాడు కూడా. ఈ మేరకు గోటబయ సింగపూర్‌ చేరిన వెంటనే స్పీకర్‌కి రాజీనామ పంపినట్లు శ్రీలంక పేర్కో‍ంది.

(చదవండి: గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే.. మరోదేశం పోవాల్సిందే!)

మరిన్ని వార్తలు