కొత్త కరోనా భయం.. నిమిషానికి 1,850 కోట్లు నష్టం

22 Dec, 2020 01:52 IST|Sakshi

లండన్‌కు వారంపాటు ఫ్లైట్స్‌ బంద్‌

31వరకు నిషేధం
హమ్మయ్య... కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది. మాస్క్‌ కాస్త పక్కకు పెట్టి ఊపిరిపీల్చుకోవచ్చు.. అనుకునేలోపే.. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్‌ పుట్టుకొచ్చింది. కరోనా కంటే వేగంగా దూసుకొస్తోంది. ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను ఈ వైరస్‌ ఉలిక్కిపడేలా చేసింది.  బ్రిటన్‌లో మొదట గుర్తించిన ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్‌ ఇప్పటికే డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టింది. దీంతో పలు దేశాలు యూకే నుంచి రాకపోకలను నిషేధించాయి. 

బ్రిటన్‌లో కొత్త వైరస్‌ నేపథ్యంలో భారత్‌ బుధవారం నుంచి డిసెంబర్‌ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. మంగళవారం అర్ధరాత్రిలోపు వచ్చినవారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేస్తామని, ఆ టెస్ట్‌లో ఎవరైనా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలితే వారిని క్వారంటైన్‌కు పంపిస్తామని ప్రకటించింది. బ్రిటన్‌ నుంచి వేరే దేశం వచ్చి, అక్కడి నుంచి భారత్‌ రావాలనుకుంటున్న ప్రయాణికులను కూడా అడ్డుకోవాలని డీజీసీఏ ఆదేశించింది.

►కొత్త తరహా వైరస్‌పై కేంద్రం అప్రమత్తంగా ఉంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  – కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ 

నిమిషానికి 1,850 కోట్లు నష్టం
సూచీల మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపద హారతిలా కరిగిపోయింది. ట్రేడింగ్‌లో వారికి ప్రతి నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.6.89 లక్షల కోట్లను కోల్పోయారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ  రూ.1.78 లక్షల కోట్లకు దిగివచ్చింది. 

రాష్ట్రంలో అలర్ట్‌
బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రం అప్రమత్తమైంది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షలు చేసిన తర్వాతే పంపాలనినిర్ణయించింది. 

మరిన్ని వార్తలు