చైనా పెట్టుబడులకు బ్రేక్‌..  

7 Jan, 2021 16:36 IST|Sakshi

50కి పైగా ప్రతిపాదనలు పెండింగ్‌లోనే  

నిబంధనల కఠినతరమే కారణం  

స్టార్టప్‌లకు నిధుల కొరత 

సాక్షి,ముంబై: పొరుగు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసినప్పట్నుంచీ చైనా నుంచి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్లు గణనీయంగా తగ్గాయి. నిర్దిష్ట నిబంధనలపై స్పష్టత కొరవడటంతో చైనా, హాంకాంగ్‌ దేశాలకు చెందిన 150కి పైగా ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ)/వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో దేశీ స్టార్టప్‌ సంస్థలకు నిధుల కొరత సమస్య తీవ్రమవుతోంది. ఖేతాన్‌ అండ్‌ కో అనే న్యాయసేవల సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌తో సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రెస్‌ నోట్‌ 3 (పీఎన్‌3)ను రూపొందించింది. భారతీయ కంపెనీల్లో బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న చైనాను కట్టడి చేయడమే దీని ప్రధాన లక్ష్యం అయినప్పటికీ.. ఇందులోని కొన్ని అంశాలపై స్పష్టత కొరవడటంతో మిగతా సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపైనా ప్రభావం పడుతోందని నివేదిక తెలిపింది. ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్‌లకు భారత్‌తో సరిహద్దులు ఉన్నాయి. పీఎన్‌3 సవరణలకు ముందు కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన సంస్థలు మాత్రమే భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయాలంటే కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. 

పెట్టుబడులు 72 శాతం డౌన్‌..
చైనా, హాంకాంగ్‌ పెట్టుబడులు.. రెండేళ్ల క్రితం వరకూ దేశీ స్టార్టప్‌లకు ప్రధాన ఊతంగా నిల్చాయి. 2019లో 3.4 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు రాగా 2020లో 72 శాతం క్షీణించి 952 మిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. చైనా నుంచి పెట్టుబడులు 64 శాతం క్షీణించి 377 మిలియన్‌ డాలర్లకు పడిపోగా.. హాంకాంగ్‌ నుంచి ఏకంగా 75 శాతం తగ్గి 575 మిలియన్‌ డాలర్లకు క్షీణించాయి. అయితే, కరోనా వైరస్‌ మహమ్మారి పరిణామాలు, చైనా నుంచి పెట్టుబడుల క్షీణత వంటి అంశాలు ఎలా ఉన్నప్పటికీ 2020లో పీఈ/వీసీ పెట్టుబడులు ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 39.2 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 814 డీల్స్‌ కుదిరినట్లు వెంచర్‌ ఇంటెలిజెన్స్‌ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇందులో సింహభాగం వాటా 27.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు .. రిలయన్స్‌ రిటైల్, జియోలోకే వచ్చాయి.   

కొత్త మార్గదర్శకాలివీ .. 
పీఎన్‌3 ప్రకారం భారత్‌తో సరిహద్దులున్న దేశాలకు చెందిన సంస్థలు భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోం శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెట్టుబడుల ద్వారా అంతిమంగా లబ్ధి పొందే యజమాని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనపై గందరగోళం నెలకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం అంతిమ లబ్ధిదారు.. తైవాన్, హాంకాంగ్, మకావు వంటి దేశాలకు చెందిన వారైనా .. ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేసినా .. చైనా లాంటి సరిహద్దు దేశాల ద్వారా చేసే పెట్టుబడులకు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటోంది.  కరోనా సంక్షోభ పరిస్థితులను అడ్డం పెట్టుకుని ఇతర దేశాల మదుపుదారులు (ముఖ్యంగా చైనా సంస్థలు) దేశీ కంపెనీలను టేకోవర్‌ చేయడాన్ని నిరోధించేందుకే ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిందని ఖేతాన్‌ అండ్‌ కో పార్ట్‌నర్‌ రవీంద్ర ఝున్‌ఝున్‌వాలా తెలిపారు.  చైనాపై ఆర్థికాంశాలపరంగా ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టిక్‌టాక్, పబ్‌జీ వంటి 200కి పైగా చైనా యాప్‌లను నిషేధించడం, టెలికం పరికరాల నిబంధనలను కఠినతరం చేయడం వంటివి ఈ కోవకు చెందినవేనని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు