Great resignation: కొలువుకు టాటా

27 Jun, 2022 04:54 IST|Sakshi

నచ్చిన పని, ఎక్కడి నుంచైనా...   ప్రపంచమంతటా ఇదే కొత్త ట్రెండు

ఆఫీసుకెళ్లి పని చేయడంపై అయిష్టత

అమెరికాలో గతేడాది 4.7 కోట్ల రాజీనామాలు

ఒక్క మార్చిలోనే 45 లక్షల మంది రాం రాం

భారత్‌లోనూ చాలామంది అదే బాట

ఉదయం తొమ్మిదింటికల్లా తయారై టిఫిన్‌ బాక్సు సర్దుకుని ఆఫీసుకు బయల్దేరడం. రాత్రికల్లా ఉసూరంటూ ఇల్లు చేరడం. కుటుంబీకులతో గడపాలన్నా, పెళ్లిళ్ల వంటి వాటికి వెళ్లాలన్నా సెలవు రోజుల్లోనే! ఇదంతా ఒకప్పటి ఉద్యోగి జీవనక్రమం. కానీ కరోనాతో అంతా మారిపోయింది. ఇంటినుంచే పని.

భార్యాబిడ్డలతో గడుపుతూనే, ఇంటి పనులూ చేసుకుంటూనే, బయటికెళ్లి సరదాగా గడుపుతూనే ఆఫీసు పని కూడా చేసుకునే కొత్త ట్రెండు. ఇంతకాలంగా కోల్పోయిందేమిటో సగటు ఉద్యోగికి తెలిసొచ్చేలా చేసింది కరోనా. అందుకే మళ్లీ ఎప్పట్లా ఆఫీసుకు వెళ్లి పని చేయాలంటే ఎవరికీ ఓ పట్టాన మనసొప్పడం లేదు. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పని చేసే వీలున్న కొలువు చూసుకొమ్మంటోంది. ఫలితం? ఉద్యోగుల రాజీనామా వెల్లువ...  

కరోనా తర్వాత ఉద్యోగుల రాజీనామాలు కొంతకాలంగా ప్రపంచమంతటా పెరుగుతూనే ఉన్నా, అమెరికాలో మాత్రం ఈ పోకడ పలు చిన్నా పెద్దా కంపెనీలను మరీ కుదిపేస్తోంది. గతేడాది అక్కడ 4.7 కోట్ల మంది ఉద్యోగాలకు రాంరాం చెప్పినట్టు బ్యూరో ఆఫ్‌ లేబర్‌ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే ఏకంగా 45 లక్షల మంది ఉద్యోగాలు మానేశారట. ‘వీళ్లంతా నచ్చిన వేళల్లో తమకు నచ్చినట్టు పనిచేసే వెసులుబాటున్న ఉద్యోగాలు వెదుక్కుంటున్నారు. ఒకరకంగా చరిత్రలో తొలిసారిగా ఉద్యోగుల్లో ఒక ధీమా వంటివి వచ్చింది. ఉన్న ఉద్యోగం మానేసినా నచ్చిన పని వెదుక్కోవడం కష్టమేమీ కాదన్న భావన పెరిగింది’అని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ నికోలస్‌ బ్లూమ్‌ అన్నారు.

నచ్చిన పనిలో ఇప్పుడున్న జీతం కంటే తక్కువ వచ్చినా పర్లేదనే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ఆయన చెబుతున్నారు. ఉద్యోగుల్లో ఏకంగా 57 శాతం వృత్తిగత, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కోరుతున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తాజా సర్వే తేల్చింది. కరోనా కాలంలో విపరీతమైన ఒత్తిడికి లోనైన టెక్, హెల్త్‌కేర్‌ కంపెనీల ఉద్యోగులే ఇప్పుడు ఎక్కువగా కొత్త ఉద్యోగాల వైపు చూస్తున్నారు. వీరిలో చాలామంది ఐదు నుంచి పదేళ్ల అనుభవమున్నవారే. మొత్తానికి వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగులకు కొత్త జీవిత పాఠాలు నేర్పిందంటారు టెక్సాస్‌ ఎం–ఎం వర్సిటీ ప్రొఫెసర్‌ ఆంటోనీ క్లోజ్‌. 2021 నుంచీ పెరిగిపోయిన రాజీనామాల పోకడకు ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’అని పేరు పెట్టారాయన.

మన దేశంలోనూ అదే ధోరణి
మన దేశంలోనూ ఐటీ, టెలికాం రంగాల్లో ఏకంగా 86 శాతం మంది ఉద్యోగం మారాలనుకుంటున్నారని మైకెల్‌ పేజ్‌ సర్వేలో తేలింది! 2022 మార్చి త్రైమాసికంలో టీసీఎస్‌ కంపెనీలో 17.4 శాతం, హెచ్‌సీఎల్‌లో 21.9 శాతం, విప్రోలో 27.7 శాతం మంది ఉద్యోగులు మానేశారు! నచ్చిన పనివిధానం కోసం జీతం తక్కువైనా, ప్రమోషన్లు లేకున్నా పర్లేదని మన దేశంలో ఏకంగా 61 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారట!!

సర్వేలు ఏం చెప్తున్నాయి..
► ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు సాధ్యమైనంత త్వరలో ఉద్యోగం మారాలనుకుంటున్నట్టు ప్రైస్‌వాటర్‌కూపర్‌ ఇటీవల 44 దేశాల్లో నిర్వహించిన మెగా సర్వేలో తేలింది
► అధిక జీతం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నామని వీరిలో 44 శాతం మంది చెప్పగా, వృత్తి–వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత లోపించడం వల్ల జాబ్‌ మారుతున్నట్టు మరో44 శాతం మంది చెప్పారు.
► ప్రపంచవ్యాప్తంగా కేవలం 29 శాతం మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగేందుకు ఇష్టపడుతున్నట్టు గార్టర్‌ అనే సంస్థ సర్వేలో తేలింది.
► తమకు నచ్చిన పనివిధానం, పని గంటలుండే ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్నట్టు ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 79 శాతం మంది చెప్పారు.

కంపెనీల తీరూ మారుతోంది
రాజీనామాల నేపథ్యంలో కంపెనీలను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు అమెజాన్, గూగుల్‌ వంటి భారీ సంస్థలు కూడా అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. పని విధానాన్నే మార్చేస్తున్నాయి. అధిక జీతాలను ఆశగా చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఇంటినుంచి కొంత, ఆఫీసులో కొంత సమయం పని చేసేలా హైబ్రిడ్‌ విధానాన్నీ తెస్తున్నాయి. పింట్రెస్ట్‌ సంస్థ అయితే ఏకంగా బిడ్డల సంరక్షణ కోసం ఉద్యోగులకు సెలవులతో పాటు అనేక సౌకర్యాలిస్తోంది. జర్మనీకి చెందిన ఇన్సూరెన్స్‌ కంపెనీ డాబే అయితే ఇంటర్వ్యూలకు హాజరైన వారికీ నగదు బహుమతులిస్తోంది! తొలి రౌండ్‌లో 550 డాలర్లు, రెండో రౌండ్‌ చేరితే 1,100 డాలర్లు ముట్టజెబుతోంది!

మరిన్ని వార్తలు