సరదా పేరిట వెర్రి చేష్టలు.. పదేళ్ల జైలు శిక్ష

4 May, 2022 10:54 IST|Sakshi

సాటి మనషుల మీదే కాదు.. మూగ జీవాల పట్లా వేధింపులు, హింసకు పాల్పడితే చట్టం ఊరుకోదు. అలా ఓ చిన్నప్రాణితో, అదీ తన పెంపుడు జంతువుతో వెర్రి వేషాలు వేసిన వ్యక్తికి..  కఠిన కారాగార శిక్ష  స్వాగతం చెప్పింది. 

ఇంటర్నెట్‌లో(యూట్యూబ్‌లో) ఈ మధ్య ఒక వీడియో వైరల్‌ అయ్యింది. సముద్రం ఒడ్డున రెండు పిల్లులను ఆహారం ఎరవేసి కొద్దిసేపు ఆడించాడు ఓ వ్యక్తి. అలా ఆడిస్తూ.. అదంతా వీడియో తీశాడు. చివరకు.. ఓ పిల్లిని సముద్రంలోకి లాగి పెట్టి తన్నాడు. వెకిలి చేష్టలకు తోడు నవ్వులు నవ్వాడు. రెండో పిల్లితో అలానే వ్యవహరించబోయాడు. 

గ్రీస్‌లోని ఎవియా ఐల్యాండ్‌ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అయ్యింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. అది తన పెంపుడు పిల్లే అని, అక్కడ నీళ్లు లేవని, ఆ పిల్లి సురక్షితంగానే ఉంది కదా! ఆ వ్యక్తి వాదించడం మొదలుపెట్టాడు. తనకు జంతువులంటే విపరీతమైన పనే అని చెప్తున్నాడు. కానీ, అతని నేరం మాత్రం రుజువైంది. దీంతో అక్కడి చట్టాల ప్రకారం.. అతనికి పేదళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

ఇక పౌర హక్కుల పరిరక్షణ మంత్రి టకిస్‌  థియోడోరికాకోస్‌ నిందితుడి అరెస్ట్‌ను ధృవీకరించారు. మూగ జీవాల పట్ల ఇలాంటి హింసను సహించే ప్రసక్తే లేదని అంటున్నారాయన. గ్రీస్‌ చట్టాల ప్రకారం.. ఎవరైనా మూగ జీవాలను హింసించినా, దాడులకు పాల్పడినా పదేళ్లు జైలు శిక్షతో పాటు ఐదు నుంచి పదిహేను వేల డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రమాదం నుంచి ఆ పిల్లి సురక్షితంగా బయటపడిందని, స్థానికంగా ఉన్న యానిమల్‌ సొసైటీ దాని సంరక్షణ చూసుకోవడంతో పాటు సదరు నిందితుడిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు