గ్రేటా: భారత్‌‌లో కరోనాను అడ్డుకోవాలి.. ప్రపంచ దేశాల సహాయం అవసరం

25 Apr, 2021 10:56 IST|Sakshi

 న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డ్‌ స్థాయిలో పెరుగుతోంది. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ వైరస్‌ తీవ్ర రూపం దాల్చుతోంది. రోగులు ఆక్సిజన్‌, బెడ్ల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రాణాలు కూడా పోతున్నాయి. భారత్‌లో కరోనా పరిస్థితులపై ప్రపంచ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌  స్పందించారు. ఇండియా పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో భారత్‌కు ప్రపంచ దేశాలు సహాయం చేయాలని కోరారు.

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌.. ఫస్ట్‌ వేవ్‌ మించి విధ్వంసం సృష్టిస్తోందనే చెప్పాలి. ఏప్రిల్ నెలలో వరుసగా నాలుగవ రోజూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇక దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‌లోని ఈ దారుణ పరిస్థితి చూసి స్పందిస్తూ గ్రెటా థన్‌బర్గ్ ఆవేదన చెందుతూ.. భారత్‌‌ ప్రస్తుతం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని, ఈ ఆపద నుంచి బయటపడటానికి ప్రపంచ దేశాలు భారత్‌కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. "భారతదేశంలో కరోనా కారణంగా జరుగుతున్న దారుణ పరిణామాలను చూసి ఇండియాకు అవసరమైన సహాయాన్ని వెంటనే ప్రపంచ దేశాలు అందించాలి" అని గ్రేటా ట్వీట్ చేశారు.  దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, బెడ్స్‌ కొరత తీవ్రంగా ఏర్పడిందని..దీంతో అనేక మంది రోగులు మరణిస్తున్నారని తెలిపింది. కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి జాతీయ రాజధానితో సహా పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు వైద్య ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 

( చదవండి: కరోనా: 24 గంటల్లో కొత్తగా 3,46,786 కేసులు )

 

మరిన్ని వార్తలు