ఇంట్లో వాకింగ్‌కు గిన్నిస్‌ రికార్డు!

18 Oct, 2020 04:55 IST|Sakshi

లండన్‌: బరువు తగ్గడం కోసం ఇంట్లో వాకింగ్‌ చేస్తూవచ్చిన 70 ఏళ్ల పెద్దాయనకు తాను ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు డౌటు వచ్చింది. అనుమానం వచ్చిందే తడవు వెంటనే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు లేఖ రాశాడు. ఆయన రికార్డును ప్రస్తుతం గిన్నిస్‌ బుక్‌ పరిశీలిస్తోంది. వింటుంటే వింతగా ఉందా! కానీ ఇదే నిజం. ఐర్లాండ్‌కు చెందిన భారతీయ సంతతి ఇంజనీర్‌ వినోద్‌ బజాజ్‌ తాజాగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు లేఖ రాశారు. తాను 1500 రోజుల్లో భూమి చుట్టుకొలతకు సమానమైన 40,075 కిలోమీటర్ల దూరం నడిచానని చెప్పుకొచ్చారు.

తన నడకను లెక్కగట్టేందుకు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ను వాడానని సాక్ష్యం చూపుతున్నారు. 2016లో బరువు తగ్గే ఉద్దేశ్యంతో వాకింగ్‌ ఆరంభించినట్లు ఆయన చెప్పారు. క్రమంగా ఇది ఒక అలవాటుగా మారిందన్నారు. తొలి ఏడాది పూర్తయ్యేసరికి 7600 కిలోమీటర్ల దూరం పూర్తి చేసినట్లు పేసర్‌ ట్రాకర్‌ యాప్‌ చూపిందని చెప్పారు. రెండో ఏడాదికి తన నడక 15200 కిలోమీటర్లను దాటిందన్నారు. ఇది చంద్రుడి చుట్టుకొలత కన్నా ఎక్కువ. ఈ ఏడాది సెప్టెంబర్‌ 21కి భూ చుట్టుకొలతకు సమానమైన దూరం తాను నడిచినట్లు నమోదయిందని తెలిపారు. ఇందుకు మొత్తం 1496 రోజులు పట్టిందన్నారు. చెన్నై నుంచి వినోద్‌ 1975లో స్కాట్‌లాండ్‌ వచ్చారు. తర్వాత ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు