11,602 లాలీపాప్‌లతో వెరైటీ రికార్డు.. కండిషన్స్‌ ఆప్లై!

7 Oct, 2022 12:16 IST|Sakshi

దక్షిణాఫ్రికాకు చెందిన ఎన్‌ఎస్‌ఆర్‌ఐ అనే స్వచ్ఛంద సంస్థ లాలీపాప్‌లతో వెరైటీ గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. లాలీపాప్‌లతో రికార్డు అనగానే వాటిని గుటుక్కుమనిపించడం వంటిదేదో అయ్యుంటుందిలే అని అనుకోకండి. ఎందుకంటే ఎన్‌ఎస్‌ఆర్‌ఐకి చెందిన 27 మంది వాలంటీర్లు డర్బన్‌ నగరంలోని ఓ బీచ్‌ ఒడ్డున లాలీపాప్‌లను ఒకదాని పక్కన ఒక లాలీపాప్‌ను పేర్చడం ద్వారా పాత రికార్డును బద్దలుకొట్టారు. ఇందులో విశేషం ఏముందంటారా? లాలీపాప్‌లతో ఒక కిలోమీటర్‌కుపైగా పొడవైన గీతను తయారు చేసినందుకే గిన్నిస్‌ నిర్వాహకులు అధికారికంగా దీన్ని రికార్డుగా గుర్తించారు.

ఇందుకోసం ఎన్ని లాలీపాప్‌లు ఉపయోగించారో తెలుసా? ఏకంగా 11,602 లాలీపాప్‌లు! చూసేందుకు సాదా సీదాగా అనిపించినా దీన్ని సాధించేందుకు పెద్ద కసరత్తే జరిగింది. లాలీ పాప్‌ల కొసలన్నీ ఒకదాన్ని ఒకటి తాకుతూ ఉంటేనే దీన్ని రికార్డుగా గుర్తిస్తామని గిన్నిస్‌ నిర్వాహకులు షరతు విధించారట. అలాగే ఒకసారి మొదలుపెట్టాక మళ్లీ వెనకాల పేర్చిన లాలీపాప్‌లను జరపడం వంటివి చేయరాదని తేల్చిచెప్పారట. అయినప్పటికీ వాలంటీర్లు కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే దీన్ని చేసి చూపించారు. తద్వారా గతంలో 9,999 లాలీపాప్‌లతో తయారు చేసిన పొడవాటి గీత రికార్డును తిరగరాశారు.
చదవండి: 60సెకన్లలో ఏకంగా మూడున్నర కోడికాళ్లను మింగేసింది

A post shared by StumboSA (@stumbosa)

మరిన్ని వార్తలు