మనుషుల కంటే తుపాకులెక్కువ ! 3 వారాలు..  38 కాల్పులు.. 70 ప్రాణాలు

25 Jan, 2023 03:38 IST|Sakshi

ఇదీ అమెరికా

మీకు ఒక విషయం తెలుసా..?  అమెరికాలో నిప్పులు గక్కిన తుపాకీ తూటాలకు 1968–2017 మధ్య 15 లక్షల మంది అమాయకులు బలయ్యారు.  ఈ సంఖ్య అమెరికా స్వాతంత్య్ర సంగ్రామం నుంచి ఆ దేశం చేసిన యుద్ధాల్లో కోల్పోయిన సైనికుల కంటే ఎక్కువ. 

గత ఏడాదే అమెరికా తుపాకుల విక్రయానికి సంబంధించి బైడెన్‌ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తెచ్చింది.  అయినప్పటికీ కొత్త సంవత్సరంలో కేవలం మూడు వారాల్లో 38 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. దాదాపుగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో ఈ దారుణ మారణకాండను ఇక అరికట్టలేరా ? 

అమెరికా నెత్తురోడుతోంది. గన్‌ కల్చర్‌ విష సంస్కృతి మరింతగా విస్తరిస్తోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కాల్పుల శబ్దాలు భయపెడుతున్నాయి. అయితే చంపడం, లేదంటే ఆత్మహత్య చేసుకొని చావడం. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి బయటకు వెళితే క్షేమంగా వెనక్కి వస్తారో లేదో తెలీదు. చదువుకోవడానికి బడికి వెళితే ఏ ఉన్మాది ఏం చేస్తాడోనని హడలిపోవాలి. నైట్‌ క్లబ్బులో విందు వినోదాలైనా,  రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లినా ఎటు వైపు నుంచి ఈ తూటా దిగుతుందో చెప్పలేము.

విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్న వాళ్లలో యువత ఎక్కువ మంది ఉన్నారని తేలడంతో గత ఏడాది జూన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వారి చేతుల్లోకి తుపాకులు వెళ్లకుండా విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టాన్ని తెచ్చారు. అయినా కాల్పులు పెరిగాయే తప్ప తగ్గలేదు. 2023కి అగ్రరాజ్యం కాల్పులతో స్వాగతం పలికింది. ఒహియో, ఫ్లోరిడా, షికాగో, కరోలినా, పెన్సిల్వేనియాలలో తుపాకీల మోత మోగింది.

అప్పట్నుంచి  38 సార్లు కాల్పులు జరిగితే 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 21న కాలిఫోర్నియాలో మాంటెరరీ పార్క్‌లో చైనీయుల కొత్త సంవత్సరం వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది మరణిస్తే 48 గంటలు తిరక్కుండానే కాలిఫో ర్నియా హాఫ్‌ మూన్‌ బే వ్యవసాయక్షేత్రంలో ఏడు గురు తూటాలకు బలయ్యారు. షికాగోలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించారు.  

ఎన్నాళ్లీ నెత్తుటి మోత ..!
అమెరికా రాజ్యాంగానికి రెండో సవరణ పౌరులు తుపాకులు కలిగి ఉండే హక్కుని కల్పించింది. రెండు ప్రధాన పార్టీల్లో రిపబ్లికన్లు తుపాకీలు కలిగి ఉండడానికి మద్దతుగా ఉండడం ఈ విషసంస్కృతిని కూకటి వేళ్లతో పెకిలించివేయడానికి వీల్లేకుండా చేస్తోంది. ప్రభుత్వం గన్‌ కల్చర్‌పై కఠిన ఆంక్షలు విధించాలని భావించిన సమయంలో సుప్రీం కోర్టు బహిరంగంగా తుపాకీ తీసుకువెళ్లే హక్కు అమెరికన్లకు ఉందంటూ గత ఏడాది సంచలన తీర్పు ఇచ్చింది.

నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ప్రజాప్రతినిధులతో బలమైన లాబీయింగ్‌ చేస్తూ తుపాకుల నిషేధానికి ఎప్పటికప్పుడు అడ్డం పడుతూ ఉంటుంది. టెక్సాస్‌ పాఠశాలలో ఒక టీనేజర్‌ జరిపిన కాల్పుల ఘటనలో 21 మంది విద్యార్థులు బలవడంతో ఒక్కసారిగా ప్రజల్లో కూడా తుపాకీ సంస్కృతిపై వ్యతిరేకత వచ్చి అదొక ప్రజా ఉద్యమంగా మారింది. అమెరికా ప్రజల్లో 60శాతం మంది తుపాకుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీనేజర్లకి తుపాకులు విక్రయిస్తే వారి నేరచరితను విచారించాలంటూ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రిపబ్లికన్లు అధికారంలో ఉన్న  రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేయడం లేదు. శక్తిమంతమైన రాష్ట్రాలు తలచుకుంటేనే ఈ తుపాకుల హింసకు అడ్డుకట్టపడుతుందనే అభిప్రాయాలున్నాయి.           

► అమెరికాలో తుపాకీ తూటాలకు రోజుకి సగటున 53 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.  
► కరోనా సమయంలో కాల్పుల ఘటనలు ఎక్కువగా జరిగాయి. ఆ సమయంలో తుపాకుల అమ్మకాలు ఏకంగా 63% పెరిగాయి.
► 2013 నుంచి ఏఆర్‌–15 రైఫిల్స్‌ అమ్మకాలు ఏడాదికి కోటికి పైగా జరగడం ఆందోళన కలిగిస్తోంది.  
► 2020లో కాల్పులు దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచాయి. ఆ ఏడాది 610 కాల్పులు జరగ్గా 45,222 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హత్యలు, ఆత్మహత్యలు కూడా ఉన్నాయి.  
► 2021లో రైఫిళ్లు, పిస్తోళ్లు వంటి చిన్న ఆయుధాల మార్కెట్‌ 370 కోట్ల డాలర్లుగా ఉంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు