ప్రిన్స్‌ ఫిలిప్‌కు గన్‌ సెల్యూట్‌

11 Apr, 2021 04:04 IST|Sakshi

యూకే వ్యాప్తంగా 8 రోజుల సంతాపం ప్రారంభం

లండన్‌: విండ్సర్‌ కోటలో శుక్రవారం కన్నుమూసిన రాణి ఎలిజెబెత్‌–2 భర్త, డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బరో ప్రిన్స్‌ ఫిలిప్‌(99)కు సంతాప సూచికంగా గన్‌ సెల్యూట్‌ చేశారు. 8 రోజుల సంతాప ప్రారంభ సూచికగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లోని రాజధానులు లండన్, కార్డిఫ్, బెల్‌ఫాస్ట్, ఎడిన్‌బరోలలో శనివారం మధ్యాహ్నం నిమిషానికి ఒక రౌండ్‌ చొప్పున 41 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దేశవ్యాప్తంగా ఇలా గన్‌ సెల్యూట్‌ చేసే జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఈ కార్యక్రమం 18వ శతాబ్దం నుంచి ఆనవాయితీగా వస్తోందని రాయల్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. ఇలాంటి గన్‌ సెల్యూట్‌ రాణి విక్టోరియా చనిపోయిన సమయంలో 1901లోనూ పాటించారని వివరించింది.

రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బరోకు రాయల్‌ నేవీతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని గన్‌ సెల్యూట్‌ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపింది. గన్‌ సెల్యూట్‌ కార్యక్రమాలు ఆన్‌లైన్‌తోపాటు టీవీల్లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. పార్లమెంట్‌ కొత్తగా ఎలాంటి చట్టాలు చేయదు. సంప్రదాయం ప్రకారం, రాణి ఎలిజెబెత్‌ ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొనరు. కొత్తగా ఎలాంటి చట్టాలను ప్రభుత్వం ఆమె ఆమోదం కోసం పంపించదు. డ్యూక్‌ జీవిత కాలాన్ని ప్రతిబింబిస్తూ అబ్బేలోని టెనోర్‌ బెల్‌ను శుక్రవారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని నిమిషానికి ఒకసారి చొప్పున 99 పర్యాయాలు మోగించనున్నారు. రాయల్‌ సెరిమోనియల్‌ ఫ్యూనె రల్‌ పూర్తి వివరాలు త్వరలో ఖరారు కానున్నాయి.

మరిన్ని వార్తలు