హెచ్‌1బీ వీసా ఫీజుల బాదుడు !

6 Jan, 2023 05:51 IST|Sakshi

కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చిన అమెరికా

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసా దరఖాస్తు సహా అన్ని ఇమిగ్రేషన్‌ ఫీజుల మోత మోగించేందుకు అమెరికా సిద్ధమైంది. సంబంధిత ప్రతిపాదనలను అమెరికా ఇమిగ్రేషన్‌ విభాగం ప్రచురించింది. 460 డాలర్లుగా ఉన్న హెచ్‌–1బీ వీసా దరఖాస్తు ధరను ఏకంగా 780 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. వలసేతర వీసాల్లో భారతీయులు అధికంగా పొందే హెచ్‌–1బీ వీసా దరఖాస్తు ధరను భారీగా పెంచడంపై విమర్శలొస్తున్నాయి. మిగతా ఫీజులూ దాదాపు ఇలాగే భారీగా ఉన్నాయి. ఓ–1 దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచనున్నారు.

అంటే ఒక్కసారిగా 229 శాతం పెంపు అన్నమాట. ఎల్‌–1 ధరను 460 డాలర్ల నుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచేయనున్నారు. అంటే ఏకంగా 332 శాతం పెరుగుదల. హెచ్‌–2బీ దరఖాస్తుల ధర 460 డాలర్ల నుంచి ఒకేసారి 1,080 డాలర్లకు చేరుకోనుంది. అయితే, ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని మార్చి ఏడో తేదీలోపు వచ్చే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ధరలు మారుస్తామని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం వివరణ ఇచ్చింది. ఒకవేళ ఈ ఫీజులు అమలైతే అదనంగా తీసుకునే బయోమెట్రిక్‌ సేవల ఫీజును రద్దుచేస్తామని ప్రతిపాదించింది. 2016 ఏడాది నుంచి ఇప్పటివరకు ఫీజులు పెంచలేదని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది.

వీసా ఎదురుచూపులు తగ్గించేందుకు కృషి
భారత్‌లో వీసా దరఖాస్తు దారులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పారు. సుదీర్ఘకాలం వీసా కోసం ఎదురుచూస్తున్న వారి ఆందోళనను తాము అర్థం చేసుకుంటామన్నారు. వీసా దరఖాస్తుల పరిశీలనను చకచకా పూర్తి చేసేందుకుగాను విదేశాంగ శాఖ సిబ్బంది పెంచామన్నారు.

మరిన్ని వార్తలు