భారతీయ టెక్కీలకు భారీ ఊరట

2 Apr, 2021 04:21 IST|Sakshi

హెచ్‌–1బీ వీసాల నిషేధంపై ముగిసిన గడువు

కొత్తగా ఎలాంటి పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయని సర్కార్‌

వాషింగ్టన్‌: డాలర్‌ డ్రీమ్స్‌ కలలుకంటున్న భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభించింది. హెచ్‌1బీ సహా విదేశీ వర్కర్స్‌ వీసాలపై నిషేధం విధిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వుల గడువు  మార్చి 31తో ముగిసింది. అధ్యక్షుడు  అధ్యక్షుడు బైడెన్‌ ఆ నిషేధాన్ని మళ్లీ పొడిగిస్తూ ఎలాంటి ఉత్వర్వులు జారీ చేయకపోవడంతో అమెరికాకు వెళ్లాలనుకునే వివిధ దేశాలకు చెందిన టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది కరోనా సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొని ప్రపంచ మార్కెట్లు మూతపడిన సమయంలో ట్రంప్‌ హెచ్‌–1బీ సహా వలసేతర వీసాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించారు.

తొలుత డిసెంబర్‌ 31వరకు నిషేధం విధించారు. ఆ తర్వాత ఆ నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. తాను అధికారంలోకి వస్తే వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తానని బైడెన్‌ హామీ ఇచ్చారు. అమెరికాలో దీనిపై పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించాయి. హెచ్‌1బీపై నిషేధం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని, నిపుణులైన పనివారు దొరకరని కొందరు వాదిస్తే, తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులు దొరకడం  వల్ల స్థానికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. వీసాలపై నిషేధాన్ని కొనసాగించాలంటూ కొందరు రిపబ్లికన్‌ పార్టీ  సెనేటర్లు  బైడెన్‌కు లేఖలు కూడా రాశారు. కరోనా సంక్షోభంతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, దాదాపుగా కోటి మంది అమెరికన్లు ఉద్యోగాల్లేకుండా ఉన్నారని అందుకే  హెచ్‌–1బీలపై నిషేధం పొడిగించాల్సిందేనంటూ మిసౌరీ సెనేటర్‌ జోష్‌ హాలీ ఆ లేఖలో పేర్కొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు