తాలిబన్లతో కర్జాయ్‌ చర్చలు

19 Aug, 2021 06:20 IST|Sakshi

కాబూల్‌: తాలిబన్ల నేతృత్వంలో అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు వేగం పుంజుకున్నాయి. తాలిబన్‌ సీనియర్‌ నాయకుడు, హక్కాని నెట్‌వర్క్‌కు చెందిన అనాస్‌ హక్కానీ బుధవారం అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌తో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో కీలకభూమిక పోషించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ భేటీకి హాజరయ్యారు. శాంతియుతంగా అధికార బదిలీ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగాలనే ఉద్దేశంతో కర్జాయ్‌ సంప్రదింపులకు నేతృత్వం వహిస్తున్నారు. అనాస్‌తో భేటీ ప్రాథమిక చర్చల్లో భాగమని కర్జాయ్‌ ప్రతినిధి వెల్లడించారు. తాలిబన్ల రాజకీయ విభాగం సీనియర్‌ నేత ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌తో తదుపరి కీలకచర్చలకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. అన్ని పక్షాలను కలుపుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

యూఏఈలో అష్రాఫ్‌ ఘనీ
తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఆదివారం దేశం వదిలి పారిపోయిన అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీకి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆశ్రయం కల్పించింది. మానవతా దృక్పథంతో ఘనీ, ఆయన కుటుంబాన్ని శరణార్థులుగా అనుమతించా మని యూఏఈ విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. అయితే యూఏఈలో ఎక్కడ తలదాచుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. తొలుత ఆయన తజకిస్తాన్‌కు పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు