మా చేతులు క‌ట్టేసిన‌ట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్‌ ఖాన్‌

2 Jun, 2022 16:55 IST|Sakshi

పాకిస్థాన్‌ ఆర్మీ వ్యవస్థపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతి ఒక్కరూ బ్లాక్‌మెయిల్‌ చేశారని, తన చేతుల్లో అధికారం ఉండేది కాదని,  ఎవరి ఆధీనంలో ఉండేదో అందరికీ తెలుసని పరోక్షంగా ఆర్మీని ఉద్ధేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ఏప్రిల్‌లో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణంలో నెగ్గడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే. అయితే అమెరికా తనను లక్ష్యంగా చేసుకొని పన్నిన కుట్రల కారణంగానే తాము అధికారం కోల్పోయామని మండిపడ్డారు. రష్యా, చైనా, అప్ఘనిస్తాన్‌ విషయంలో స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్లే అమెరికా ఆ పనిచేసిందన్నారు. 

బుధవారం ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ... పాక్‌ ఆర్మీపై మండిపడ్డారు. ‘మా ప్ర‌భుత్వం చాలా బ‌ల‌హీన స‌ర్కారు. మా చేతులు క‌ట్టేసిన‌ట్లుగా ప‌రిస్థితి ఉండేది. ఎన్నిక‌ల్లో గెలిచిన స‌మ‌యంలో ప‌లు పార్టీల సాయం తీసుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వ‌చ్చింది. ప్ర‌తిచోట నుంచి మాకు బెదిరింపులు వ‌చ్చాయి. నేను ప్రధానిగా ఉన్న స‌మ‌యంలో అధికారం నా చేతిలో లేదు. అది ఎవ‌రి చేతుల్లో ఉందో ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు’’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. 
చదవండి: Russia Ukraine War: ఉక్రెయిన్‌ చేతికి అమెరికా రాకెట్లు!

‘శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున తమ దేశానికి బలమైన సైన్యాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. అయితే బలమైన సైన్యం, బలమైన ప్రభుత్వానికి మధ్య "సమతుల్యత" పాటించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మా హయాంలో అది మాత్రం సాధ్య‌ప‌డ‌లేదు. మేము అన్ని వేళ‌లా వారి (ఆర్మీ)పైనే ఆధార‌ప‌డ్డాము. వాళ్లు చాలా మంచి ప‌నులు కూడా చేశారు. కానీ చేయాల్సిన అనేక పనులు చేయ‌లేదు. జాతీయ జ‌వాబుదారీ సంస్థ (ఎన్ఏబీ)లు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. అందుకే అధికారం మొత్తం వారి చేతుల్లోనే ఉంటుంది’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

కాగా 2018లో మిలటరీ అండతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్, పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంలో పదవీచ్యుతుడైన ఏకైక పాక్ ప్రధాని. ఆయన స్థానంలో పీఎంఎల్‌-ఎన్‌కు చెందిన షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఎంపికయ్యారు. అలాగే  75 ఏళ్ల స్వతంత్ర్య పాకిస్థాన్‌ చరిత్రలో దాదాపు సగానికి పైగా ఆర్మీనే ఆ దేశాన్ని పాలించింది. ఇప్పటికీ దేశ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించి సైన్యమే కీలక నిర్ణయం తీసుకుంటుంది.

మరిన్ని వార్తలు