Friendship Day 2021: ఇలాంటి ఫ్రెండ్‌.. మీకేవరైనా ఉన్నారా?

1 Aug, 2021 08:43 IST|Sakshi

Happy Friendship Day 2021: అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన స్నేహ ప్రవాహం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫేస్‌బుక్‌, ముఖ్యంగా వాట్సాప్‌ గ్రూపుల్లో, స్టేటస్సుల్లో ఫ్రెండ్‌షిప్‌ గొప్పదనం గురించి కొటేషన్లు, దోస్త్‌ల ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. రెగ్యులర్‌గా ఫ్రెండ్‌షిప్‌ విలువ చెప్పే కంటెంట్‌కు ఇవాళ ఫుల్‌ గిరాకీ ఉంటుంది. అది చూసి కొందరికి ‘వావ్‌’ అనిపించొచ్చు.. మరికొందరికి ‘అబ్బో’ అనిపించొచ్చు. కానీ, ఎవరెన్ని అనుకున్నా స్నేహం అంటే..
.
.
.
.
.
.
.
.
.
.

ఒక కచ్చితమైన అవసరం. 

‘ఈస్ట్‌ ఆర్‌ వెస్ట్‌ ఫ్రెండ్‌షిప్‌ ఈజ్‌ ది బెస్ట్‌’, ‘స్నేహాన్ని మించిది లేదు’.. ఇలాంటి కొటేషన్స్‌ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. సింగిల్‌ కింగ్‌లైనా ఉంటారేమోగానీ.. ఫ్రెండ్‌ లేని మనిషి అరుదనే చెప్పాలి. జీవితంలో ఎవరితో షేర్‌ చేసుకోవద్దని ఫిక్స్‌ అయ్యే విషయాల్ని కూడా.. చివరికి ఏదో ఒక ‘బలహీన’ సందర్భంలో చెప్పుకునేది స్నేహితుడికే!. అలాగని మిగతా బంధాలను తక్కువేం చేయదు స్నేహ బంధం. అయితే స్నేహాల్లోనూ రకరకాలుంటాయి. అలాగే స్నేహితుల్లో రకరకాల మనస్తత్వాలవాళ్లూ ఉంటారు. అందుకే ఈ ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా దోస్తీలోని ఆ జానర్ల గురించి సరదాగా చర్చించుకుందాం. 

పక్కా కమర్షియల్
స్నేహంలో అవసరం ఉండొచ్చు. కానీ, స్నేహాన్ని పూర్తి అవసరంగా మార్చుకునేటోళ్లూ ఉంటారు. మనిషిని అమితంగా ఆకర్షించే నెగెటివిటీ వల్ల చాలామందికి స్నేహం మీద కలిగే భావనే ఇది. అఫ్‌కోర్స్‌.. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఈ లోకంలో అన్నింటి కన్నా మిన్న అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. చివరికి డబ్బు-అంతస్థుల దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు తడబడుతుంది స్నేహం.
  

టార్చర్‌ స్నేహం
వీళ్లు ప్రాణ స్నేహితులంటూ చెప్తుంటారు. ఊరంతా ప్రచారం చేస్తారు. వీళ్ల మాటలు కోటలు దాటుతాయి. కానీ, పక్కలోనే ఉంటూ పోటు పోడుస్తుంటారు. నస పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అయితే వీళ్ల స్నేహంలో ఒక స్వచ్ఛత ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. అవసరాల్లోనే కాదు.. ఆపదలోనూ వదలుకోలేని బలహీనత కనిపిస్తుంటుంది వీళ్ల స్నేహంలో. అందుకే ‘ఫ్రెండ్​వి రా’ అనుకుంటూ కలకాలం కలిసి మెలిసి ఉంటారు.
 

ఏజ్​లెస్​ దోస్తులు
ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. కానీ, స్నేహానికి వయసుతో సంబంధం ఉండదని మరో నిజం. ఇది నిరూపించే దోస్తులు మన చుట్టూరానే.. మనలోనే కనిపిస్తుంటారు. కలిసి సరదాలు చేస్తారు. గోలలు చేస్తుంటారు. కలిసే గోతిలో పడుతుంటారు. వాళ్ల స్నేహం వాళ్లకే కాదు.. అవతలి వాళ్లకూ ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచుతుంటుంది.

అవసరానికో స్నేహం
ప్రతీ ఫ్రెండూ అవసరమేరా అనే కొటేషన్‌ తెలుసు కదా!. అలాగే ఈ రకం స్నేహంలో అవసరం తీరేంత వరకే స్నేహం కొనసాగుతుంది. ఆ అవసరంలో ఉన్నంత దాకా వీళ్లు వెంట నడుస్తారు. అవసరమైతే సాయం చేస్తారు. తీరా.. తమ అవసరం పూర్తిగా తీరాక హ్యాండిచేస్తారు. అపార్థాలు, అవమానాలు, అనుమానాల నడుమ ఇలాంటి స్నేహాలు కలకాలం కొనసాగడం కొంచెం కష్టమే!.
 
 

ప్రాణ స్నేహితులు
ఈ స్నేహం చాలా చాలా ప్రత్యేకం. చిన్న వయసు నుంచి మొదలై చివరిదాకా సాగే అవకాశాలే ఎక్కువ. ఈ స్నేహంలో రాగద్వేషాలు కనిపించేది అతితక్కువ. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునేంత స్థాయి వీళ్లలో ఉంటుంది. ప్రాణం పోయేంత వరకు స్నేహాన్ని విడిచిపెట్టవు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢబంధం వీళ్లది. పైగా ఎలాంటి తారతమ్యాలు లేనిది ఈ స్నేహం. అందుకే ‘చిలకా-కోయిల’లా కలకలకాలం కలిసి మెలిసి ఉంటారు. ఇలాంటి స్నేహంలో నడివయసులో పుట్టి కడదాకా సాగే స్నేహ బంధాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
 

లవ్లీ ఫ్రెండ్స్​
అవతలి వాళ్లకు ఇదొక చిల్లర-చిచ్చర స్నేహం అనిపించొచ్చు. కానీ, వాళ్ల స్నేహంలో ఒక ఫ్రెష్‌నెస్‌ ఉంటుంది. వాళ్ల ఆనందం వాళ్లదే. అవతలి వాళ్ల గురించి అస్సలు పట్టించుకోరు. పోటాపోటీగా ఒకే అమ్మాయికి బీట్‌ కూడా కొడతారు. బడి నుంచి గుడి దాకా, రూమ్‌ నుంచి ఇంటి దాకా ప్రతీ విషయం చర్చించుకుంటారు. అవసరాలకు సాయం ఒకరికొకరు చేసుకుంటారు. కెరీర్‌ ఎదుగుదలకు వీళ్ల ప్రోద్భలం ఉంటుంది. అందుకే ఇది కూడా ఒక ప్రత్యేకమైన స్నేహమే!.
 

ఇంటి స్నేహం
స్కూల్‌, కాలేజీలు, ఆఫీసులు.. ఫ్రెండ్స్‌ అంటే ఇక్కడే దొరుకుతారా?. మనసు పెడితే ఇంట్లోనూ ఇంతకన్నా బలమైన స్నేహమే దొరుకుతుంది. అమ్మానాన్న, అక్కాచెల్లి, అన్నాతమ్ముడు, బావాబామ్మర్ది, మామాఅల్లుడు, తాతామనవడు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బంధాలు స్నేహ బంధాలుగానూ మార్చుకోవచ్చు. సంతోషమొచ్చినా.. దుఖమొచ్చినా వాళ్లతో పంచుకుని మనసు కుదుటపర్చుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లో అపార్థాలకు చోటు ఉండని ఏకైక స్నేహం.. ఇంటి స్నేహమే!

వాట్సాప్‌ బ్యాచ్‌
చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటారు. సంవత్సరాల దొర్లిపోయే దాకా గుర్తుండరు. సడన్‌గా గుర్తుకొస్తారు. ఏదో ఒక సందర్భంలో కలుస్తారు. అడ్డగోలు వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేస్తారు. అయితే మెసేజ్‌ల వరద.. లేదంటే గప్‌చుప్‌. ఇలాంటి స్నేహితులు గెట్‌ టు గెదర్‌లోనే కలిసేది. చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా. ‘గుర్తుకొస్తున్నాయి..’ అంటూ రీయూనియన్లలో సందడి చేసే బాపతి అన్నమాట. అఫ్‌కోర్స్‌.. బిజీ, టైం లేదంటూ కలయికను ఎగ్గొట్టి స్నేహితుల రోజున ఉప్పెనలా మెసేజ్‌లు పెట్టే దోస్తులు చాలామందే ఉన్నారండోయ్‌. ఇవేకాదు.. ఇంకా చాలా రకాల స్నేహాలే ఉంటాయి.

అయితే నవ్వినా, తిట్టినా, ఏడ్పించినా, జోకులేసుకున్నా, చివరికి మోసానైనా తట్టుకుని నిలబడేది ఒక్క స్నేహమే. ఎంత చెప్పుకున్నా దూరాలను దగ్గర చేసే స్నేహం అంతిమంగా గొప్పదే. అందుకే ఆ బంధాన్ని గౌరవిస్తూ ఈ రోజును గుర్తించడం, అనుభవాలేవైనా అ‍ప్పటిదాకా జీవితంలో తారసపడిన రకరకాల స్నేహాల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం తప్పేం కాదు. చివరగా.. అందరికీ హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే.

-సాక్షి, వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు