మమ్మీ అతడు మంచివాడు కాదు..

11 Jan, 2021 11:47 IST|Sakshi
చిన్న కుమారుడు హ్యారీతో ప్రిన్సెస్‌ డయానా(ఫైల్‌ ఫొటో)

ప్రిన్సెస్‌ డయానా జీవితాన్ని మార్చిన 1995 నాటి ఇంటర్వ్యూ!

ప్రిన్సెస్‌ డయానా అందమైన మహిళ. బ్రిటన్‌ రాజకుటుంబ వారసుడు ప్రిన్స్‌ చార్ల్స్ భార్య. వీరికి ఇద్దరు కొడుకులు. ప్రిన్స్‌ విలియం, ప్రిన్స్‌ హ్యారీ. ఇద్దరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. ప్రిన్స్‌ విలియం- కేట్‌ మిడిల్‌టన్‌ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు ప్రిన్స్‌ లూయీస్‌, ప్రిన్స్‌ జార్జ్‌.. ఒక కుమార్తె ప్రిన్సెస్‌ చార్లెట్. ప్రిన్స్‌ హ్యారీ-  మేఘన్‌ మోర్కెల్‌ జంటకు కొడుకు ప్రిన్సెస్‌ ఆర్చీ ఉన్నాడు. అన్నీ సజావుగా సాగి, డయానా నేడు బతికి ఉంటే ఇంతటి ముచ్చటైన కుటుంబాన్ని చూసి కచ్చితంగా సంతోషపడేవారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనుమరాలు.. అన్ని బంధాలతో ఆమె జీవితం సంపూర్ణమయ్యేది

కానీ దాంపత్య జీవితంలో చెలరేగిన సంఘర్షణ, భర్తతో విభేదాలు, వ్యక్తిగతంగా మోయలేని నిందలు.. వీటికి తోడు విధి చిన్నచూపు చూడటంతో 1997లో ఫ్రాన్సులో జరిగిన కారు ప్రమాదంలో ప్రిన్సెస్‌ డయానా దివంగతులయ్యారు. అయితే ఇరవయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డయానా మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఆమె జీవితానికి సంబంధించిన విశేషాలతో నేటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రిన్సెస్‌ డయానా మాజీ ప్రియుడిగా పేరొందిన హసంత్‌ ఖాన్‌ ఇటీవల డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఆమె గురించి మరోసారి చర్చ మొదలైంది.

మమ్మీ.. తను మంచివాడు కాదు..
చనిపోవడానికి రెండేళ్ల ముందు అంటే 1995లో డయానా పనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. తప్పుడు బ్యాంకు పత్రాలు చూపించి బీబీసీ సీనియర్‌ జర్నలిస్టు మార్టిన్‌ బషీర్‌.. డయానాను ఇందుకు ఒప్పించారని ఆమె సోదరుడు ఎర్ల్‌ స్పెన్సర్‌ ఇటీవల ఆరోపించారు. రాజభవనంలోని కొంతమంది సిబ్బంది ప్రిన్సెస్‌ వ్యక్తిగత వివరాలు లీక్‌ చేస్తున్నారని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. మార్టిన్‌పై ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ వార్తా సంస్థ సుప్రీంకోర్టు మాజీ జడ్జి లార్డ్‌ డైసన్‌ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో హార్ట్‌ సర్జన్‌ అయిన హసంత్‌ ఖాన్‌(పాకిస్తాన్‌లో జన్మించారు) మాట్లాడుతూ..  మార్టిన్‌ తన మాటలతో డయానాను ప్రభావితం చేసి, ఆమె మెదడునంతా చెత్తతో నింపేశాడన్నారు. నైతిక  విలువలు వదిలేసి, అడ్డదారులు తొక్కి ఎట్టకేలకు ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నాడని ఆరోపించారు. ‘‘మా పెళ్లి సమయంలో మేం ముగ్గురం’’ అని తన చేత చెప్పించాడని పేర్కొన్నారు. ‘‘తనొక మోసగాడు. ప్రిన్సెస్‌ను నేను పెళ్లి చేసుంటానా అంటూ నన్ను అత్యంత వ్యక్తిగత విషయాల గురించి అడిగాడు. బషీర్‌ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని నేను ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను. అతడితో మాట్లాడవద్దని హెచ్చరించాను కూడా. 

నిజానికి ఆమెలో ఉన్న అత్యంత ఆకర్షించే గుణం ఏంటో తెలుసా? తన మానసిక బలహీనతే. దానినే మార్టిన్‌ అవకాశంగా తీసుకున్నాడు. ఆమె మనసును కకావికలం చేశాడు. డయానా భర్త ప్రిన్స్‌ చార్లీ కారణంగా నానీ టిగ్గీ గర్భవతి అయ్యారని చెప్పాడు. అతడిని ఆమె నమ్మారు. అయితే అప్పటికి టీనేజర్‌గా ఉన్న ప్రిన్స్‌ విలియం.. ‘‘మమ్మీ.. తను అస్సలు మంచి వ్యక్తి కాదు’’ అని హెచ్చరించేంత వరకు ఇది కొనసాగింది’’ అని చెప్పుకొచ్చారు. కాగా హసంత్‌ ఖాన్‌, ప్రిన్సెస్‌ డయానా రెండేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె అతడిని ముద్దుగా మిస్టర్‌ వండర్‌ఫుల్‌ అని పిలిచేవారట. ఇక హ్యారీ జన్మించిన తర్వాత డయానా- చార్లెస్‌ వైవాహిక బంధంలో విభేదాలు తారస్థాయికి చేరాయంటూ గతంలో వెలువడిన కథనాలు చెబుతున్నాయి.(చదవండి: డయానాలా మాట్లాడగలనా అని భయం)

మిస్టర్‌ వండర్‌ఫుల్‌తో సంభాషణ
అంతేగాక దాంపత్య జీవితంలో అసంతృప్తి, భర్త ప్రవర్తన కారణంగానే డయానా అభ్రదతాభావానికి లోనై ఇతరులవైపు ఆకర్షితురాలయ్యారని అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె కారు ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. అదే విధంగా ఆ సమయంలో భర్త ప్రిన్స్ చార్లెస్, ఇద్దరు కుమారులు విలియమ్, హ్యారీ... స్కాట్‌లాండ్‌లో వేసవి సెలవుల్ని గడుపుతుండగా, డయానా ఫ్రాన్స్‌లో ఉండటంపై విపరీతపు కామెంట్లు వినిపించాయి. ఇక ఖాన్‌తో ప్రేమలో ఉన్న సమయంలో తన టెలిఫోన్లు ట్రాప్‌ చేస్తున్నారన్న భయంతో.. డయానా కోడ్‌ భాషలో మాట్లాడేవారట. బషీర్‌కు డాక్టర్‌ జర్మన్‌, మోల్‌ అనే ఓ రహస్య పేరుతో అతడు తనను ఇంటర్వ్యూకి ఒప్పించడానికి చేసిన ప్రయత్నాల గురించి తనకు చెప్పినట్లు ఖాన్‌ వెల్లడించారు. ఇక 1995 నాటి బషీర్‌ ఇంటర్వ్యూ వల్ల రాజ దంపతుల మధ్య మనస్పర్థలు మరింతగా పెరిగిపోయానని వారి సన్నిహితులు గతంలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు