అమ్మను చంపేశారు.. తనను కూడా వదలరా?: హ్యారీ

21 May, 2021 18:31 IST|Sakshi

కొత్త వెబ్‌ సిరీస్‌లో సంచలన విషయాలు వెల్లడించిన హ్యారీ

లండన్‌: ‘‘అమ్మ అంత్యక్రియల నాడు నాకు వినిపించిన గుర్రాల గిట్టల శబ్దం నుంచి.. కారులో నేను అమ్మతో ప్రయాణిస్తుండగా.. మమ్మల్ని వెంటాడిన ఫోటోగ్రాఫర్ల వరకు ప్రతి జ్ఞాపకం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది.. అమ్మను కోల్పోయిన బాధ ఇప్పటికి నన్ను కలచివేస్తూనే ఉంది’’ అంటూ ప్రిన్స్‌ హ్యారీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక అమ్మలాగే.. నా భార్యను కూడా కోల్పోతాననే భయంతోనే రాచకుంటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లానని తెలిపాడు హ్యారీ. ఒక కొత్త టీవీ డాక్యుమెంటరీ సిరీస్‌ ది మీ యూ కాన్ట్‌ సీలో తన మనోవేదనను వెల్లడించారు హ్యారీ. 

హ్యారీ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ తెల్ల జాతీయుడు కానీ మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్న నాటి నుంచి.. ఆమె మరణం వరకు ఫోటోగ్రాఫర్లు తనను వెంబడిస్తూనే ఉన్నారు. చివరకు ఏం జరిగిందో అందరికి తెలుసు. ఆమె మరణించిన తర్వాత కూడా వదల్లేదు. ఇప్పుడు తను(మేఫన్‌) చనిపోయే వరకు కూడా ఆగరు.. చరిత్ర పునరావృతం చేయాలని మీరు భావిస్తున్నారా’’ అంటూ ఆవేదనకు గురయ్యాడు. ఇది ఇలానే కొనసాగితే.. నా జీవితంలో మరో స్త్రీని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చాను’’ అన్నాడు హ్యారీ.

హ్యారీ, అతని అమెరికన్ భార్య మేఘన్ మార్కెల్‌ గురించి బ్రిటిష్ పత్రికలలో జాత్యహంకార వార్తలు వెలువడ్డాయి. అలానే సోషల్‌ మీడియాలో కూడా ఆమె గురించి తప్పుడు ప్రచారం జరిగింది. ఇక మేఘన్‌ మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు బ్రిటన్‌లో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని తెలిపాడు హ్యారీ.  

ఈజిప్టుకు చెందిన తన ప్రియుడు డోడి ఫయేద్‌తో కలిసి ప్రయాణిస్తున్న కారును ఛాయాచిత్రకారులు వెంబడించడంతో పారిస్‌లో జరిగిన ప్రమాదంలో యువరాణి డయానా 1997 లో 36 ఏళ్ళ వయసులో మరణించింది. ఆ సమయంలో హ్యారీకి 12 సంవత్సరాలు. ఈ డాక్యుమెంటరీలో, హ్యారీ తన సోదరుడు విలియం, తండ్రి ప్రిన్స్ చార్లెస్, మామ చార్లెస్ స్పెన్సర్‌తో కలిసి లండన్ వీధుల గుండా డయానా శవపేటిక వెనుక నడుస్తున్న నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. 

‘‘నేను ఆ దారి వెంబడి నడుస్తున్నాను.. నాకు గుర్రాల గిట్టల శబ్దం వినిపిస్తుంది.. నేను నా శరీరాన్ని విడిచిపెట్టి.. బయటకు వచ్చినట్లు అనిపించింది. ఉక్కిరిబిక్కిరి అయ్యాను’’ అంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు హ్యారీ. ‘‘ఈ బాధను నేను దాదాపు 20 ఏళ్ల పాటు అణిచిపెట్టుకున్నాను.. తాగుడుకు అలవాటు పడ్డాను. కెమరాలు చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వీరు ఓ నిస్సహాయ మహిళను ఆమె తన కారు వెనక సీటులో మరణించే వరకు వెంటాడారు. ఆ సమయంలో నేను నా తల్లికి సాయం చేయలేకపోయాను.. మా అమ్మకు న్యాయం జరగలేదు.. నా బాల్యంలో మా అమ్మ విషయంలో ఏదైతే జరిగిందో.. దాని గురించి నాకు ఇప్పటికి కోపం వస్తుంది. ఇప్పుడు నాకు 36 ఏళ్లు.. కానీ ఇప్పుడు కెమరాలు చూసినా.. వారు నన్ను వెంటాడుతున్నట్లు ఆందోళనకు గురవుతాను. కెమరాల క్లిక్‌, ఫ్లాష్‌ చూస్తే.. నా రక్తం మరిగిపోతుంది’’ అన్నాడు హ్యారీ. 

‘‘మేఘన్‌ను కలిసే వరకు నేను ఈ బాధ అనుభవించాను. ఆ తర్వాతే నేను థెరపీ తీసుకోవడం ప్రారంభించాను. ఇక మా బంధం కొనసాగితేనే.. నేను నా గతాన్ని  ఎదుర్కోగలనని అనిపించింది. అందుకే తనను వివాహం చేసుకున్నాను అన్నాడు.  ఈ విషయాలన్నింటిని హ్యారీ తన మీ యూ కాన్ట్‌ సీ సిరీస్‌లో తెలిపారు. అమెరికన్‌ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో కలిసి హ్యారీ నిర్మించిన "మీ యూ కాన్ట్‌ సీ" సిరీస్ ఆపిల్ టీవీ + లో శుక్రవారం విడుదలైంది.

చదవండి: మేఘన్‌ జాతివివక్ష ప్రకంపనలు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు