హృదయ విదారకం: బిడ్డను కాపాడటం కోసం శత్రువుకెదురెళ్లి తల్లి ప్రాణ త్యాగం

7 Apr, 2022 15:27 IST|Sakshi

ప్రపంచంలోని తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. తనకంటే పిల్లల గురించే ఎక్కువ ఆలోచించే ఏకైక వ్యక్తి అమ్మ. పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లికి చిన్నవారే. ఏ ఆపద ఎదురైనా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రమాదం నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చివరికి  తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగం చేస్తోంది.. తాజాగా తల్లి ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయెల్ ఓ జింకపై దాడి చేయబోతున్న మొసలి వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఇందులో నదిలో ఆకలితో ఉన్న ఓ మొసలికి కొంత దూరంలో జింక ఈత కొడుతూ కనిపించింది. జింకను ఆహారంగా చేసుకోవాలని భావించిన మొసలి.. దానిని పట్టుకునేందుకు వేగంగా కదులుతుంది. అయితే కొంత దూరంలో ఉన్న తల్లి జింక రాబోయే ప్రమాదాన్ని గమనిస్తుంది. తన బిడ్డను రక్షించుకునేందుకు వెంటనే నీటిలోకి దూకి రెండింటి మధ్యలోకి వస్తుంది. దీంతో దూరంలో ఉన్న పిల్ల జింకను వదిలేసి పక్కనే ఉన్న తల్లి జింక మొసలికి ఆహారంగా మారుతుంది.

తన బిడ్డను కాపాడుకునే క్రమంలో తల్లి జింక ప్రాణత్యాగం చేస్తుంది. ఏప్రిల్ 6న పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు జింక ప్రాణ త్యాగం తల్లి ప్రేమకు నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన గుండెల్ని పిండేస్తోందని కామెంట్‌ చేస్తున్నారు. తల్లికి తన బిడ్డ పట్ల ఉన్న ఎనలేని ప్రేమను గుర్తు చేస్తుందంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. 
చదవండి: Viral Video: ఓరిని తెలివి సల్లగుండా.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా!

మరిన్ని వార్తలు