అమెరికా, కెనడాలలో ఎండ ప్రచండం

2 Jul, 2021 05:35 IST|Sakshi
కెనెడాలోని కాల్గరీలో సేదతీరుతున్న బాలుడు

రాబోయే రోజుల్లో వందలాది మరణాలు సంభవించే అవకాశం

సలేమ్‌(అమెరికా): అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్‌తోపాటు కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. పలు నగరాల్లో ఆల్‌టైమ్‌ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల ధాటికి రాబోయే రోజుల్లో వందలాది మరణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒరెగాన్‌ రాష్ట్రంలో ఎండల కారణంగా 60 మందికి జనం మృతిచెందినట్లు అధికారులు బుధవారం రాత్రి ప్రకటించారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన ముల్ట్‌నోమాలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 45 మంది మరణించారు.

కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియాలో శుక్రవారం నుంచి బుధవారం మధ్య కనీసం 486 మంది ఆకస్మికంగా ప్రాణాలు విడిచారని అధికార వర్గాలు తెలిపాయి. వాంకోవర్, బ్రిటీష్‌ కొలంబియాలో చాలా ఇళ్లల్లో ఏసీ సదుపాయం లేదని, వృద్ధులు ఎండ వేడిని తట్టుకోలేక చనిపోతున్నారని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా 20కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. సియాటెల్, పోర్ట్‌ల్యాండ్‌తోపాటు పలు నగరాల్లో రికార్డు స్థాయిలో 115 డిగ్రీల ఫారెన్‌హీట్‌(46 డిగ్రీల సెల్సియస్‌) ఉష్ణోగ్రత నమోదయ్యింది. వాషింగ్టన్, ఒరెగాన్, ఇడాహో, మోంటానా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండల ధాటికి 44 నుంచి 97 ఏళ్లలోపు వారే ఎక్కువగా చనిపోతున్నారని ఒరెగాన్‌ రాష్ట్రం ముల్ట్‌నోమా కౌంటీ మెడికల్‌ ఎగ్జామినర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు