నడిసంద్రంలో 12 గంటల ఈత.. బతుకు జీవుడా అనుకుంటూ ఆ మంత్రి ఇలా..

22 Dec, 2021 22:28 IST|Sakshi

మడగాస్కర్‌: హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో మడగాస్కర్‌ దేశ మంత్రి సెర్జ్ గెలె ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన సాహసంతో సుమారు 12గంటల పాటు పోరాడి సముద్రంలో ఈదుకుంటూ బయటపడ్డారు. తాను మరణించలేదని బతికే ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం ఐలాండ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా హెలికాప్టర్‌ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ మునక ప్రమాదంలో 39మంది చనిపోయిట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి మంత్రి బృందం అక్కడికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్‌ కుప్పకూలింది. హెలికాప్టర్‌లో ఉన్న మంత్రితో పాటు మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ఘటన పట్ల దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో మంత్రితో పాటు మిగతా ఇద్దరు అధికారులు మరణించారని ఆయన నివాళులు అర్పించారు. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతమైన మహాంబోకు చేరుకున్నారు. హెలికాప్టర్ కూలిపోవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

ప్రమాదం జరిగిన తర్వాత తాను రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు సముద్రంలో ఈదుకుంటూ వచ్చినట్లు మంత్రి గెలె తెలిపారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బతికే ఉన్నానని మహాంబో గ్రామస్తులకు చెప్పారు. ఆయన హెలికాప్టర్‌లోని ఒక సీటును సుముద్రం నీటిపై తేలడానికి ఉపయోగించుకున్నారని పోలీస్ చీఫ్ జఫిసంబత్రా రావోవీ పేర్కొన్నారు. ఆయన క్రీడల్లో ఎల్లప్పుడూ గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించేవారని, 30 ఏళ్ల వ్యక్తిలా బతకడానికి పోరాడారని రావోవీ ప్రశంసించారు.

మరిన్ని వార్తలు