ప్రాంక్‌ అనుకున్నాం.. రక్తపు మడుగులో ఆయన్ని చూశాకే.. ఘోరం తెలిసొచ్చింది

15 Aug, 2022 08:49 IST|Sakshi

న్యూయార్క్‌: సుప్రసిద్ధ నవలా రచయిత సల్మాన్‌ రష్డీపై దాడిని సాహిత్య లోకం జీర్ణించుకోలేకపోతోంది. ఘోరమైన దాడి నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని.. అయితే పూర్తిస్థాయి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడేం చెప్పలేమని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్తున్నారు. ఈ తరుణంలో ప్రత్యక్ష సాక్షి, దాడిలో గాయపడ్డ హెన్రీ రెస్సే.. సల్మాన్‌ రష్డీపై దాడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

న్యూయార్క్‌లో గత శుక్రవారం ఓ సాహిత్య కార్యక్రమానికి హాజరైన సల్మాన్‌ రష్డీపై దాడి జరిగింది. ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న తరుణంలో.. దుండగుడు వేదికపైకి దూకి రష్డీపై విచక్షణా రహితంగా గొంతులో పొడిచి దాడి చేశాడు. ఆ సమయంలో ఆ ఈవెంట్‌ నిర్వాహకుడు, ఆయన్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్న సిటీ ఆఫ్‌ అసైలం ఎన్జీవో ప్రెసిడెంట్‌  హెన్రీ రెస్సే.. సైతం దాడిలో గాయపడి కోలుకున్నారు. 

‘అసలు ఆరోజు అక్కడ ఏం జరిగిందో అర్థం కావడానికి కొంచెం సమయం పట్టింది. సల్మాన్‌ రష్డీకి ప్రాణ హని ఉందన్న చర్చ గత కొన్నేళ్లుగా నడుస్తోంది. ఈ క్రమంలో మమ్మల్ని ఆటపట్టించేందుకు ప్రాంక్‌కు పాల్పడి ఉంటారని భావించాం. ఆ ఘటనను సైతం ప్రాంక్‌ స్టంట్‌ ఏమో అనుకున్నాం. కానీ, రక్తపు మడుగులో రష్డీగారిని చూశాకే.. అదొక వాస్తవ ఘటన అని అర్థమైంది. అప్పటికే అక్కడంతా గందరగోళం నెలకొంది. నాపైనా దాడి జరిగింది’ అని రెస్సే గుర్తు చేసుకున్నారు. 

సల్మాన్‌ రష్డీపై జరిగింది భౌతిక దాడి మాత్రమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సాహిత్య లోకం మీదే జరిగినట్లు లెక్క. దీనిని ముక్తకంఠంతో మేం ఖండిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. 1997లో ఆయన ప్రసంగం చూశాక.. మా ఎన్జీవో ఈవెంట్‌కు ఆయన అర్హుడని భావించాం. ఇన్నాళ్లకు అది కుదిరింది. ఈ లోపే ఈ ఘటన జరగడం బాధాకరం. ఘటన జరిగిన సమయంలో దుండగులు సిబ్బందితో పాటు ఈవెంట్‌కు హాజరైన వాళ్లతో సైతం పెనుగులాడాడు. చివరికి సిబ్బందిని అతన్ని కట్టడి చేయగలిగింది అని రెస్సే తెలిపారు. పెన్సిల్వేనియాలోని ఓ ఆస్పత్రిలో సల్మాన్‌ రష్డీ చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: ఈ నవల రక్తాన్ని కళ్ల చూస్తోంది.. ఎందుకో తెలుసా?

మరిన్ని వార్తలు