కొత్త కరోనా వైరస్‌.. బ్రిటన్‌ నుంచి విమానాలు రద్దు..

21 Dec, 2020 15:08 IST|Sakshi

న్యూఢిల్లీ :  కరోనా వైరస్‌ తిప్పలు ప్రజలకు ఇంకా తప్పడం లేదు.  ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఏడాదిగా పీడిస్తున్న ఈ మహమ్మారి తలలు వంచేందుకు ఇప్పటికీ సరైన వ్యాక్సిన్‌ జనజీవనంలోకి అడుగుపెట్టలేదు. ఇప్పడిప్పుడే కోవిడ్‌ తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకుంటున్న జనాలను బ్రిట‌న్‌లో వెలుగు చూసిన ఓ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ వ‌ణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్‌ కరోనా వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తోంది. దీనివ‌ల్ల బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటి పోవడంతో లండ‌న్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.  కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ నిబంధనలు కొనసాగుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు . క్రిస్‌మస్‌ సంబ‌రాల‌ను సైతం ర‌ద్దు చేస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. చదవండి: యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త రూపం

అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు యూకే నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. బ్రిటన్‌ నుంచే వ‌చ్చే విమానాల‌పై నిషేధం విధించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ సూపర్ స్ప్రెడర్‌లా ఉందని సోమవారం (డిసెంబర్ 21) ఆయన ట్వీట్ చేశారు. త‌క్షణమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కాగా ఇప్పటి వరకు ప్రయాణ నిషేధాన్ని ప్రకటించిన జాబితాలో ఉన్న దేశాలు.

1. ఫ్రాన్స్‌ : రోడ్డు, వాయు, సముద్రం, రైలు ద్వారా వస్తువుల రవాణాకు సంబంధించిన ప్రయాణాలతో సహా ఆదివారం అర్ధరాత్రి నుంచి 48 గంటల వరకు బ్రిటన్ నుంచి వచ్చే అన్ని ప్రయాణాలను నిలిపివేస్తామని ఫ్రాన్స్ ఆదివారం తెలిపింది. 
2. జర్మనీ: ఆదివారం నుంచి బ్రిటన్‌ నుంచి అన్ని సంబంధాలను ఆపేస్తున్నట్లు పేర్కొంది. ఇది ప్రస్తుతానికి డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతందని పేర్కొంది. కార్గో విమానాలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. 
3. ఇటలీ: ఇటీవలే బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన ఇటలీలో ఒక వ్యక్తిలో కొత్త వైరస్ కనుగొన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
4. ఐర్లాండ్‌: ఆదివారం అర్ధరాత్రి నుంచి బ్రిటన్ నుంచి వచ్చే అన్ని విమానాలను కనీసం 48 గంటలు నిషేధించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
5. కెనడా: కొత్త కరోనా వైరస్‌ వల్ల యూకే నుంచి అన్ని విమానాలను 72 గంటలు నిషేధిస్తున్నామని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చెప్పారు.
6. నెదర్లాండ్ : బ్రిటన్ నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్లే అన్ని ప్రయాణీకుల విమానాలను జనవరి 1 వరకు నిషేధించినట్లు డచ్ ప్రభుత్వం తెలిపింది.
7.  బెల్జియం: యూకే నుంచి బెల్జియంకు వెళ్లే అన్ని విమాన, రైలు ప్రయాణాలను ఆదివారం అర్ధరాత్రి నుంచి కనీసం 24 గంటలు నిలిపివేస్తామని ప్రధాని అలెగ్జాండర్ చెప్పారు.
8. ఆస్ట్రియా : బ్రిటన్ నుంచి ప్రయాణ నిషేధానికి వియన్నా వివరాలు రూపొందిస్తున్నట్లు ఆస్ట్రియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రెస్ ఏజెన్సీ ఏపీఏకు తెలిపింది.
9. స్వీడన్‌: బ్రిటన్ నుంచి ప్రజలు ప్రవేశించడాన్నినిషేధించడానికి దేశం సిద్ధమవుతోందని  సోమవారం అధికారికంగా పేర్కొంది..
10. ఫిన్లాండ్‌: సోమవారం మధ్యాహ్నం నుంచి రెండు వారాల పాటు యూకే నుంచి ప్రయాణీకుల విమానాలను ఫిన్లాండ్‌లో ల్యాండ్ చేయడానికి అనుమతించరని రవాణా లైసెన్సింగ్ ఏజెన్సీ ట్రాఫికామ్  ఆదివారం ఆలస్యంగా ప్రకటించింది.
11. స్విట్జర్లాండ్‌: బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్విట్జర్లాండ్ ఆదివారం తెలిపింది
12. బాల్టిక్స్‌
13. బల్గేరియా
14. టర్కీ
15. ఇరాన్‌, 
16. రొమేనియా
17. ఇజ్రాయిల్‌, 
18. సౌదీఅరేబియా
19. క్రొయేషియా ఉన్నాయి.
 

భారత్-బ్రిటన్‌ల మధ్య విమాన సర్వీసులు రద్దు
బ్రిటన్‌లో కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రభావంతో భారత్-బ్రిటన్‌ల మధ్య విమాన సర్వీసులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దును రేపు అర్ధరాత్రి నుంచి అమలు చేయనుంది. డిసెంబర్‌ 31 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. బ్రిటన్‌ నుంచి భారత్ వచ్చిన వారికి వారం రోజులు క్వారంటైన్ విధించనుంది.

మరిన్ని వార్తలు