Hibatullah Akhundzada: అఫ్గాన్‌ సుప్రీం లీడర్‌గా అఖుంద్‌జాదా

3 Sep, 2021 04:54 IST|Sakshi

 కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నేడు ప్రకటన!

ఇరాన్‌ తరహా పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తాలిబన్ల నిర్ణయం

దేశ పరిపాలన మొత్తం సుప్రీం లీడర్‌ కనుసన్నల్లోనే..

పెషావర్‌/కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ను అక్రమించిన రెండు వారాల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. దేశ అత్యున్నత నాయకుడిగా(సుప్రీం లీడర్‌) తాలిబన్‌ మత గురువు ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా(60)ను ఎంపిక చేశారు.

ఆయన బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే. ఈ విషయాన్ని తాలిబన్‌ సమాచార, సాంస్కృతిక కమిషన్‌ సీనియర్‌ ప్రతినిధి ముఫ్తీ ఇనాముల్లా సమాంఘనీ స్వయంగా వెల్లడించారు. అఫ్గాన్‌ ప్రభుత్వ అధినేత అఖుంద్‌జాదా అవుతారని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావే లేదని తేల్చిచెప్పారు. నూతన సర్కారు ఏర్పాటుపై సంప్రదింపులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. మంత్రివర్గం(కేబినెట్‌) కూర్పుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

కొత్త ప్రభుత్వంలో ప్రావిన్స్‌లకు గవర్నర్లు, జిల్లాలకు జిల్లా గవర్నర్లు ఇన్‌చార్జులుగా ఉంటారని తెలిపారు. అక్కడ పరిపాలన వారి నేతృత్వంలో కొనసాగుతుందని అన్నారు. ప్రావిన్స్‌లు, జిల్లాలకు గవర్నర్లను, పోలీసు చీఫ్‌లను, పోలీసు కమాండర్లను తాలిబన్లు ఇప్పటికే నియమించినట్లు సమాచారం. నూతన ప్రభుత్వ వ్యవస్థ పేరును, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఇంకా ఖరారు చేయలేదని ఇనాముల్లా వివరించారు.

ప్రభుత్వంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం
అఫ్గాన్‌ కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మహిళలకు, అన్ని గిరిజన తెగల సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు ఖతార్‌ రాజధాని దోహాలోని తాలిబన్‌ రాజకీయ కార్యాలయ ఉప నాయకుడు షేర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్‌జాయ్‌ గురువారం ప్రకటించారు. దేశంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కుతుందని అన్నారు. తాలిబన్లకు గట్టి పట్టున్న కాందహార్‌ నగరం నుంచే ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా ప్రభుత్వ అధినేతగా దేశ పరిపాలనను పర్యవేక్షిస్తారని తెలిపారు. భారత్, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌తో తాము సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నామని వివరించారు.

సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేసుకొనే దిశగా ఆయా దేశాలతో తాలిబన్‌ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి దాదాపు 30 మిలియన్‌ డాలర్లు అవసరమని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు పునఃప్రారంభం అయ్యాక నిర్దేశిత ప్రయాణ ధ్రువపత్రాలు ఉన్నవాళ్లు విదేశాలకు వెళ్లొచ్చని సూచించారు.

సుప్రీం లీడర్‌దే పెత్తనం
అఫ్గానిస్తాన్‌లో ఇరాన్‌ తరహా ప్రభుత్వం, పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తాలిబన్లు నిర్ణయించినట్లు తెలిసింది. ఇరాన్‌లో సుప్రీం లీడర్‌దే పెత్తనం. దేశంలో ఇదే అత్యున్నత రాజకీయ, మతపరమైన, సైనికపరమైన పదవి. అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. సైనిక, ప్రభుత్వ, న్యాయ విభాగం అధినేతల నియామకంలో సుప్రీం లీడర్‌ మాటే చెల్లుబాటు అవుతుంది. అఫ్గానిస్తాన్‌లో సుప్రీం లీడర్‌ కింద అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రిని నియమించనున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌కు లోబడి అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు.  

మరిన్ని వార్తలు