కరోనా నుంచి కోలుకున్నా వాటికి మూడు నెలల పాటు ముప్పు

27 May, 2021 00:59 IST|Sakshi

యూకే పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి 

లండన్‌: కరోనా వైరస్‌ ప్రధాన లక్ష్యం మనిషి ఊపిరితిత్తులే. ఈ వైరస్‌ వల్ల చనిపోతున్న వారిలో ఎక్కువ మందికి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకింది. వైరస్‌ బారినపడి, చికిత్సతో కోలుకున్న తర్వాత కూడా 3 నెలలపాటు ఊపిరితిత్తులు దెబ్బతినే ఉంటాయని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లోని షెఫీల్డ్‌ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో తేలింది.

కొన్ని కేసుల్లో ఈ వ్యవధి మరింత ఎక్కువ కాలం.. 9 నెలల వరకూ కొనసాగే ప్రమాదం ఉంటుందని వెల్లడయ్యింది. అంటే కరోనా నుంచి కోలుకున్నాక లంగ్స్‌ పూర్తిగా సాధారణ స్థితికి చేరాలంటే 3 నెలలకు పైగానే సమయం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అప్పటిదాకా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా అనంతరం ఊపిరితిత్తులకు కొనసాగుతున్న నష్టాన్ని సాధారణ సీటీ స్కాన్,  క్లినికల్‌ పరీక్షల ద్వారా గుర్తించలేమని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించడానికి పరిశోధకులు ఇమేజింగ్‌ అనే ఆధునిక విధానాన్ని ఉపయోగించారు.

కరోనా బారినపడినప్పటికీ ఆసుపత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందినవారిలో దీర్ఘకాలం శ్వాస సమస్య ఉంటే వారి ఊపిరితిత్తులు ఇంకా కోలుకోనట్లే భావించాలని వారు వెల్లడించారు. అయితే, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అంటున్నారు. ఈ స్టడీ వివరాలను రేడియాలజీ జర్నలిజంలో ప్రచురించారు. హైపర్‌పోలరైజ్డ్‌ జినాన్‌ ఎంఆర్‌ఐ (జిఎంఆర్‌ఐ) పరీక్ష ద్వారా ఊపిరితిత్తుల్లో అపసవ్యతలను తెలుసుకోవచ్చని పరిశోధకులు సూచించారు.  

మరిన్ని వార్తలు