కరోనా పాపం చైనాదే

24 Sep, 2020 02:21 IST|Sakshi

స్పష్టం చేసిన ట్రంప్‌

అమెరికా స్పందన భేష్‌

చర్చలతోనే వివాదాల పరిష్కారం: జిన్‌పింగ్‌

ఐక్యరాజ్య సమితి: కరోనా పాపం చైనాదే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి చైనాదే బాధ్యతగా ఐక్యరాజ్య సమితి గుర్తించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఆన్‌లైన్‌లో చేరిన ట్రంప్‌ మాట్లాడుతూ చైనా వైరస్‌ కారణంగా 188 దేశాల్లో ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు. ‘కనిపించని శత్రువు చైనా వైరస్‌తో తీవ్రమైన యుద్ధం చేశాం.

మెరుగైన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్న మనం ప్రపంచం మీదకు ప్లేగు లాంటి వ్యాధిని వదిలిన చైనాను... ఆ పాపం తనదే అని అంగీకరించేలా చేయాలని ట్రంప్‌∙అన్నారు. కరోనా వైరస్‌ చైనా లోనే పుట్టిందని, ఆ దేశ ప్రభుత్వం ఈ ప్రమాద కరమైన వైరస్‌ వ్యాప్తి విషయంలో బాధ్యతా రహి తంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు. కోవిడ్‌ విషయంలో అమెరికా యుద్ధ ప్రాతిపదికన స్పందించిందని, రికార్డు సమయంలో వెంటి లేటర్లను సమకూర్చడంతోపాటు, చాలా వేగంగా అత్యవసర చికిత్సలను అభివృద్ధి చేశామని, తద్వారా వ్యాధి కారణంగా జరుగుతున్న ప్రాణనష్టాన్ని 85 శాతం వరకూ తగ్గించగలిగామని ట్రంప్‌ వివరించారు. కోవిడ్‌ నివారణకు టీకాను అభివృద్ధి చేసిన తరువాత ప్రపంచం సరికొత్త శాంతి, సహకార, సమృద్ధతల్లో కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎవరితోనూ యుద్ధం చేసే ఉద్దేశం లేదు: జిన్‌పింగ్‌
ఒకవైపు అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూండగానే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ జనరల్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ దేశంతోనూ ప్రత్యక్ష లేదా పరోక్ష యుద్ధం చేసే ఉద్దేశం చైనాకు లేదని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ‘ఇతరులతో ఉన్న భేదాభిప్రా యాలను, వివాదాలను తగ్గించుకునేందుకు ప్రయత్నం కొనసాగుతుంది. చర్చలు, ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వివాదాల పరిష్కా రానికి ప్రయత్నిస్తాం’ అని ఆయన తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. కరోనావ్యవహారాన్ని రాజకీయం చేయడం, విభేదాలు సృష్టించడం   ఆపాలని స్పష్టం చేశారు.

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం తల్లకిందులైపోయిందని ప్రభుత్వాధినేతలతో కిటకిటలాడే జనరల్‌ అసెంబ్లీ నేడు బోసిపోయి కనిపించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అసమానతలను కరోనా వైరస్‌ అందరి దృష్టికి తెచ్చిందని, భారీ స్థాయి ఆరోగ్య విపత్తును తీసుకొచ్చిందని∙వివరించారు. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతోపాటు కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని, మానవ హక్కుల వంటి అనేక సమస్యలు మళ్లీ సవాళ్లుగా పరిణమిస్తున్నాయని అన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు