Arnold Schwarzenegger: మా నాన్నలాగా  మీరూ కావద్దు, భావోద్వేగ వీడియో

18 Mar, 2022 16:59 IST|Sakshi

టెర్మినేటర్ స్టార్, హాలీవుడ్‌ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంపై స్పందించారు.  దయచేసి ఈ యుద్ధాన్ని ముగించండి. మీరే యుద్ధాన్ని మొదలు పెట్టారు.. మీరే కొనసాగిస్తున్నారు.. మీరే దీన్ని ముగించాలి అంటూ డైరెక్టుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే రష్యా ప్రజలకు, సైనికులకు ఉద్వేగభరితమైన సందేశంతో ఒక వీడియోను షేర్‌ చేశారు కాలిఫోర్నియా మాజీ గవర్నర్.

రష్యా ప్రజలంటే తనకు  చాలా అభిమానమని అందుకే ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్నా  అన్నారు. రష్యన్ ప్రజల బలం,  వారి మనసు తనకు ఎపుడూ స్ఫూర్తినిస్తుందని అందుకే ఉక్రెయిన్‌లో యుద్ధం గురించి తెలుసుకోవలసిన భయంకరమైన విషయాలున్నాయంటూ తన తొమ్మిది నిమిషాల వీడియోలో కొన్ని అంశాలను చెప్పుకొచ్చారు. అలాగే రష్యన్ వెయిట్‌లిఫ్టర్ యూరి వ్లాసోవ్‌ 14 సంవత్సరాల వయస్సులో  తనకు  స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 

‘‘ఉక్రెయిన్‌ను 'డి-నాజిఫై' చేసే యుద్ధం అని రష్యా ప్రభుత్వం చెప్పిందని తెలుసు, "ఇది నిజం కాదు. క్రెమ్లిన్‌లో అధికారంలో ఉన్నవారు ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. ఇది రష్యా ప్రజల యుద్ధం కాదు  చట్టవిరుద్ధమైన యుద్ధం. ప్రపంచం మొత్తం ఖండించిన తెలివిలేని యుద్ధం కోసం మీ జీవితాలు, మీ అవయవాలు, మీ భవిష్యత్తులు త్యాగం చేయబడుతున్నాయి. ఇప్పటికే వేలాది రష్యా  సైనికులు ప్రాణాలు కోల్పోయారు.  దేశం కోసం వారంతా  యుద్దం చేస్తోంటే నాయకులు మాత్రం విజయంకాంక్షతో ఉన్నారు.

స్క్వార్జెనెగర్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో దాని చర్యలు, క్రూరత్వం  కారణంగా ప్రపంచం రష్యాకు వ్యతిరేకంగా మారింది, పిల్లల ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రితో సహా రష్యన్ ఫిరంగిదళాలు  బాంబులతో నేలమట్టం  చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా  స్క్వార్జె నెగర్ రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాలో నాజీల కోసం పోరాడుతున్నప్పుడు తన తండ్రికి కలిగిన గాయాలను గుర్తుచేసుకున్నారు. శారీరకంగానూ, మానసికంగానూ కుంగిపోయి జీవితాంతం బాధతోనే గడిపారు, మీరు ఆయనలా బాధపడటం తనకు ఇష్టం లేదంటూ రష్యా దళాలకు సందేశమిచ్చాడు.  అలాగే రష్యాల్లో ఉక్రెయిన్‌పై దండయాత్రకు వ్యతిరేకంగా   ఉద్యమిస్తున్న ఉద్యమకారులను మీరు నా హీరోలు అంటూ ప్రశంసించారు. 

కాగా  ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి నేటికి (మార్చి, 18) 23వ రోజు. అమెరికా అధ్యక్షులు జో బిడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈరోజు  చర్చించనున్నారని  వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ ప్సాకి తెలిపారు.

మరిన్ని వార్తలు