గిన్నిస్‌ రికార్డు పసికందు.. శ్రమించి ఊపిరి నిలిపిన డాక్టర్లు

10 Aug, 2021 07:54 IST|Sakshi

ఆపిల్‌పండు లాంటి  బిడ్డను కనమని కాబోయే తల్లులను దీవిస్తుంటారు పెద్దలు. కానీ, సింగపూర్‌లో నిజంగానే యాపిల్‌ పండు సైజులో ఓ బిడ్డ పుట్టింది. అయితే బతకడం కష్టమనుకున్న తరుణంలో దాదాపు 25 వారాలపాటు శ్రమించిన డాక్టర్లు.. ఎట్టకేలకు ఆ బిడ్డను ఆరోగ్యవంతమైన బరువుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు.

సింగపూర్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌(NUH)లో కిందటి ఏడాది జూన్‌ 9న నెలలు నిండకుండానే ఓ పాప పుట్టింది. కేవలం 24 సెంటీమీటర్ల పొడవు, కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టందా పాప. దీంతో సగటు ఆపిల్‌ పండు కన్నా తక్కువ బరువు ఉందంటూ గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది ఆ చిన్నారి. అయితే బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేయడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. వాళ్ల శోకాన్ని అర్థం చేసుకుని రిస్క్‌ చేసి మరీ 13 నెలలపాటు ఫ్రీ ట్రీట్‌మెంట్‌ ద్వారా ప్రయత్నించారు ఎన్‌హెచ్‌యూ వైద్యులు. 

13 నెలల ఐసీయూ చికిత్సలో అద్భుతం జరిగింది. చివరికి 6.3 కేజీల ఆరోగ్యవంతమైన బరువుకు చేరిన ఆ చిన్నారిని.. ఈమధ్యే  ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఆ బిడ్డకు వెక్‌(క్వెక్‌) యూ గ్జువాన్‌ అని పేరుపెట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నారి ఆరోగ్యంగా తమ చేతికి దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ లోవా రికార్డుల ప్రకారం.. అమెరికాలో 245 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి పేరిట రికార్డు ఉండగా.. వెక్‌ యూ గ్జువాన్‌ ఆ రికార్డును చెరిపేసింది.

>
మరిన్ని వార్తలు