కరోనా: భయపెడుతున్న హాంకాంగ్‌ కేసు

25 Aug, 2020 10:28 IST|Sakshi

హాంకాంగ్‌: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. వైరస్‌ రూపాన్ని మార్చుకుంటూ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికి మలేషియాలో వెలుగు చూసిన కేసుల్లో కరోనా వైరస్‌ రూపాన్ని మార్చుకోవడమే కాక 10 రెట్లు ప్రమాదకరంగా మారినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాంకాంగ్‌లో వెలుగు చూసిన ఓ కేసు మరింత ఆందోళన కలిగిస్తుంది. మూడు నెలల క్రితం మహమ్మారి బారిన పడిన వ్యక్తికి మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు హాంకాంగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఆగస్టు మధ్యలో స్పెయిన్ పర్యటన నుంచి హాంకాంగ్‌కు తిరిగి వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనావైరస్ భిన్నమైన జాతి లక్షణాలు ఉన్నట్లు జన్యు పరీక్షలలో వెల్లడయ్యింది. సదరు వ్యక్తి మార్చిలో కరోనా బారిన పడి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సం‍దర్భంగా డాక్టర్ కెల్విన్ కై మాట్లాడుతూ.. ‘ఈ వ్యక్తికి మొదటిసారి కరోనా వచ్చినప్పుడు తేలికపాటి లక్షణాలు కనిపించాయి. కానీ రెండవసారి అసలు ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. అతనికి రెండో సారి కరోనా వచ్చినట్లు హాంకాంగ్ విమానాశ్రయంలో నిర్వహించిన స్క్రీనింగ్ ద్వారా తెలిసింది. దీన్ని బట్టి కోవిడ్-19‌ నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి జీవితం కాలం ఉండటం లేదని తెలియడమే కాక కొందరు రెండో సారి వైరస్‌ బారిన పడుతున్నట్లు అర్థమయ్యింది. అయితే ఎంత మందిలో ఇలా జరుగుతుందనే దాని గురించి ఇప్పుడే చెప్పలేం’ అన్నారు. (ప్లాస్మా థెరపీ: అమెరికా ఆమోదం!)

ప్రస్తుతం వెలుగు చూసిన కేసు వల్ల పలు కీలకాంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో అనేక చిక్కులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ‘ముఖ్యంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి, పాఠశాలలు తెరవడం, పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సామాజిక కార్యకలాపాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాక రెండో సారి వైరస్‌ బారిన పడివారిలో తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా వారి రోగ నిరోధక శక్తి కాపాడుతుంది, లేనిది ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ఎదుర్కొన్న వైరస్‌ల విషయంలో రోగ నిరోధక శక్తి యాంటీబాడీలను ఎలా తయారుచేయాలో గుర్తుంచుకుంటుంది’ అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే రెండో సారి వైరస్‌ బారిన పడిన వారిలో ఎంత తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలియదు. కనుక ఇప్పటికే కోవిడ్‌ బారిన పడి కోలుకున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి వాటిని తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. అంతేకాక వీరి ద్వారా వైరస్‌ మరికొందరికి వ్యాపిస్తుంది లేనిది అనే దాని గురించి ఇంకా స్పష్టం తెలియదు అంటున్నారున నిపుణులు. 

మరిన్ని వార్తలు