జాతీయ భద్రతా చట్టం : మీడియా మొఘల్ అరెస్ట్ 

10 Aug, 2020 11:01 IST|Sakshi

హాంకాంగ్ : కొత్త భద్రతా చట్టం ప్రకారం హాంకాంగ్ ప్రభుత్వం మీడియా మొఘల్ ను అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. జాతీయ భద్రతా చట్టం కింద హాంకాంగ్ దిగ్గజ వ్యాపారవేత్త, నెక్ట్స్ డిజిటల్ మీడియా అధినేత జిమ్మీ లై (71), ఇతర ముఖ్యులను అరెస్టు చేసింది. భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఏడుగురిని అరెస్టు చేసినట్లు హాంకాంగ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజాస్వామ్య అనుకూల విధానాలతో హాంకాంగ్‌లో జరిగిన అల్లర్లకు జిమ్మీ మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ విదేశీ శక్తులతో జతకట్టాడన్నఆరోపణలపై జిమ్మీని అరెస్టు చేశారు. దాదాపు 200 మందికి పైగా పోలీసులు మీడియా సంస్థలోకి ప్రవేశించి గందరగోళ సృష్టించారని లై ప్రధాన వారసుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్క్ సైమన్ ట్వీట్ చేశారు. ఈ రోజు వస్తుందని ముందే  ఊహించానని, ఆపిల్ డైలీ జర్నలిస్టు ఒకరు ఆందోళనవ్యక్తం చేశారు. హాంకాంగ్ ప్రభుత్వానికి, బీజింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడే మీడియాను టార్గెట్ చేశారని ఆరోపించారు. ప్రధానంగా ఆపిల్ డైలీని మూసి వేయడం,  ఇతర మీడియా సంస్థలను బెదిరించడం లక్ష్యంగానే ఈ దాడి అని మండిపడ్డారు. ఇది పత్రికా స్వేచ్ఛకు ముగింపు అని వ్యాఖ్యానించారు.  


జూలై 1 నుండి అమల్లోకి  వచ్చేలా చైనా వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం దోషులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. అలాగే మీడియా సంస్థల ఎలక్ట్రానిక్ పరికరాలను శోధించడం, మీడియా సంస్థలతో సహా సర్వర్‌లను స్వాధీనం చేసుకునే విస్తృత అధికారాలను ఇస్తుంది. కాగా 1995లో జిమ్మీ లై స్థాపించిన నెక్స్ట్ డిజిటల్ మీడియాకు ఆపిల్ డైలీ మాతృ సంస్థ. తొలుత వస్త్ర వ్యాపారం నిర్వహించిన ఆయన ఆ తరువాత ఆపిల్ డైలీ అనే పత్రికతో మీడియా రంగంలోకి  ప్రవేశించారు. కాలక్రమంలో ఇది హాంకాంగ్, చైనా ఆధిపత్యాన్ని విమర్శించే ప్రజాస్వామ్య అనుకూల వార్తా సంస్థగా ఖ్యాతి గడించింది. సుమారు వంద కోట్ల డాలర్లు ఆస్తి ఆయన సొంతం. ఉగ్రవాదం, విదేశీ శక్తులతో కలిసి పని చేయడం లాంటి అనేక ఇతర ఆరోపణలను ఇప్పటికే లై ఎదుర్కొంటున్నారు. తాజాగా అతని కుమారులు, ప్రచురణ బృందంలోని పలువురు ముఖ్యులను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.  

మరిన్ని వార్తలు