అందుకే ఆమెపై పెప్పర్‌ స్ప్రే చేశాం..

29 Jul, 2020 14:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హాంకాంగ్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఓ మహిళపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. తమపై దాడి చేయడంతో ఆమెను అదుపు చేసేందుకు పెప్పర్‌ స్ప్రే చేసినట్లు వెల్లడించారు. ఉత్తర హాంకాంగ్‌లో జరిగిన ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మీడియా కథనం ప్రకారం... మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఓ మహిళ  షెంగ్‌ షూయి పట్టణంలోని సూపర్‌ మార్కెట్‌కు వచ్చారు. అయితే ఆమె మాస్కు ధరించకపోవడంతో సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ వారితో వాగ్వాదానికి దిగింది. (హాంకాంగ్‌తో ఒప్పందం రద్దు.. అయితే)

ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆమె తన తీరును మార్చుకోలేదు. అంతేగాక వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను అదుపు చేసేందుకు ముఖంపై పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. క్షతగాత్రుడైన పోలీస్‌ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో హాంకాంగ్‌లో మాస్కు ధరించాలనే నిబంధన తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇక జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు అక్కడ 2884 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 23 మంది కోవిడ్‌తో మృతి చెందారు. 

మరిన్ని వార్తలు