హాంకాంగ్‌లో ‘యాపిల్‌ డైలీ’ కథ ముగిసింది

25 Jun, 2021 04:01 IST|Sakshi

చివరి సంచిక కోసం ఎగబడ్డ పాఠకులు

హాంకాంగ్‌: హాంకాంగ్‌ ప్రజాస్వామ్య డిమాండ్‌కు మద్దతుగా నిలిచిన చివరి పత్రిక ‘యాపిల్‌ డైలీ’ మూతపడింది. గురువారం ఆ పత్రిక చివరి సంచిక వెలువడింది. మొత్తం 10 లక్షల కాపీలు గంటల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. యాపిల్‌ డైలీ కాపీల కోసం పాఠకులు ఎగబడ్డారు. దుకాణాల ముందు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అర్ధ స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్‌పై పూర్తిగా పట్టుబిగించేందుకు డ్రాగన్‌ దేశం చైనా పావులు కదుపుతోంది.

హాంకాంగ్‌ ప్రజాస్వామ్య ఉద్యమాలను కఠినంగా అణచివేస్తోంది. ఇన్నాళ్లూ ప్రజా పోరాటాలకు అండగా నిలిచిన యాపిల్‌ డైలీ పత్రిక మూతపడడంతో ఇక చైనాకు మరింత బలం చేకూరినట్లేనన్న వాదన వినిపిస్తోంది. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించేలా విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తోందంటూ యాపిల్‌ డైలీపై చైనా పాలకులు కన్నెర్ర చేశారు. ఇటీవల ఆ పత్రికకు చెందిన ఐదుగురు సంపాదకులను అరెస్టు చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

2.3 మిలియన్‌ డాలర్ల విలువైన యాపిల్‌ డైలీ ఆస్తులను స్తంభింపజేశారు. ఈ నేపథ్యంలో ఇక పత్రికను మూసివేయడమే శరణ్యమని యాపిల్‌ డైలీ యజమానులు నిర్ణయాని కొచ్చారు. ఈ పత్రిక మూతపడడం హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛకు చీకటి రోజని జార్జిటౌన్‌ సెంటర్‌ ఫర్‌ ఆసియన్‌ లా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ థామస్‌ కెల్లాగ్‌ చెప్పారు.

హాంకాంగ్‌ డౌన్‌టౌన్‌లో యాపిల్‌ ప్రతుల కోసం ప్రజల క్యూ  

మరిన్ని వార్తలు