1161 కిలోల ‘జంబో’ గుమ్మడి.. జాతీయ రికార్డు బద్దలు!

12 Oct, 2022 08:41 IST|Sakshi

వాషింగ్టన్‌: గుమ్మడికాయ అంటే గరిష్ఠంగా 10-20 కిలోల వరకు ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ, వెయ్యి కిలోల గుమ్మడిని ఎప్పుడైనా చూశారా? అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని హాఫ్‌ మూన్‌ బే సిటీలో జరిగిన పోటీల్లో ఏకంగా 2,560 పౌండ్లు(1161 కిలోలు) బరువైన గుమ్మడికాయను ప్రదర్శించి జాతీయ రికార్డును బద్దలుకొట్టారు ట్రావిస్‌ జింజర్‌ అనే ఉద్యానవన ఉపాధ్యాయుడు. హాఫ్‌ మూన్‌ బే సిటీలో మంగళవారం 49వ ప్రపంచ స్థాయి బరువైన గుమ్మడికాయల పోటీని నిర్వహించారు. 

ఈ పోటీకి భారీ గుమ్మడికాయను మిన్నెసోటా నుంచి తీసుకొచ్చేందుకు ఏకంగా 35 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చిందని తెలిపారు ట్రావిస్‌ జింజర్‌. ఆ రెండు రోజుల ప్రయాణంలో గుమ్మడికాయను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లు చెప్పారు. దానిని ప్లాస్టిక్‌, తడి బ్లాంకెట్లతో చుట్టి ఉంచామన్నారు. ‘మిన్నెసోటాలో వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. గుమ‍్మడి సాగుకు ప్రతికూలమనే చెప్పాలి. రోజుకు 75 గ్యాలన్ల నీటిని అందించాలి. భారీ గుమ్మడికాయను తీసుకొచ్చి పోటీలో గెలుపొందటం చాలా సంతోషంగా ఉంది.’ అని తెలిపారు. 2020లోనూ జింజర్‌ పోటీలో గెలుపొందారు. గతవారం నమోదైన 2,554 పౌండ్ల బరువు గుమ‍్మడికాయ రికార్డును తాజాగా ఆయన బద్ధలు కొట్టారు.

ఇదీ చదవండి: నీ పిచ్చి తగలెయ్య.. అది బెడ్‌రూం కాదురా అయ్యా!.. నడి రోడ్డు..

మరిన్ని వార్తలు