పక్షులు చూపిన ‘బుల్లెట్‌’ మార్గం.. నిజమే.. ఆ కథేంటంటే

25 Nov, 2022 01:16 IST|Sakshi

జపాన్‌ అంటేనే టెక్నాలజీకి మారుపేరు.. సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకూ మూలం. గంటకు నాలుగైదు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్‌ రైళ్లు ఆ దేశానికి ప్రత్యేకం. మరి బుల్లెట్‌ రైళ్లు విజయవంతం కావడానికి తోడ్పడింది ఎవరోతెలుసా..? రెండు పక్షులు. నిజమే. ఆ వివరాలేమిటో చూద్దామా..

యుద్ధం వ్యథ నుంచి.. 
రెండో ప్రపంచ యుద్ధం చివరిలో పడిన అణు బాంబులు, ఆ తర్వాతి ఆంక్షలతో జపాన్‌ బాగా కుంగిపోయింది. ఆ వ్యథ నుంచి కోలుకుని, సరికొత్తగా నిలి­చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అప్పటికే టెక్నాలజీపై పట్టున్న జపాన్‌.. ప్రపంచంలో వేగంగా ప్రయాణించే బుల్లెట్‌ రైలును 1964 అక్టోబర్‌ ఒకటిన ఆవిష్కరించింది. ట్రాక్‌ను, రైలు టెక్నాలజీని మరింతగా ఆధునీకరిస్తూ వేగాన్ని పెంచుతూ పోయింది. ఈ క్రమంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. 

గుడ్లగూబ స్ఫూర్తితో.. 
బుల్లెట్‌ రైళ్లు విద్యుత్‌తో నడుస్తాయి. పైన ఉండే కరెంటు తీగల నుంచి రైలుకు విద్యుత్‌ సరఫరా అయ్యేందుకు ‘పాంటోగ్రాఫ్‌’లుగా పిలిచే పరికరం ఉంటుంది. బుల్లెట్‌ రైలు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ పాంటోగ్రాఫ్‌ వద్ద గాలి సుడులు తిరుగుతూ విపరీతమైన శబ్దం వచ్చేది, ఆ పరికరం త్వరగా దెబ్బతినేది. జపాన్‌ శాస్త్రవేత్తలు దీన్ని నివారించడంపై దృష్టిపెట్టారు.

గుడ్లగూబలు వేగంగా ప్రయాణిస్తున్నా చప్పుడు రాకపోవడాన్ని గమనించారు. వాటి ఈకల అంచులు రంపం వంటి ఆకృతిలో ఉండటమే దీనికి కారణమని గుర్తించి.. బుల్లెట్‌ రైళ్ల ‘పాంటోగ్రాఫ్‌’లను ఆ తరహాలో అభివృద్ధి చేశారు. 1994లో బుల్లెట్‌ రైళ్లకు అమర్చారు. ప్రస్తుతం బుల్లెట్‌ రైళ్లతోపాటు చాలా వరకు ఎలక్ట్రిక్‌ రైళ్లకు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. 

గాలి నిరోధకతను ఎదుర్కొనేందుకు.. 
బుల్లెట్‌ రైళ్ల వేగసామర్థ్యాన్ని పెంచే క్రమంలో గాలి నిరోధకతతో సమస్య వచ్చింది. ఈ రైళ్ల వేగం ఆశించినంత పెరగకపోవడం, టన్నెళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత తీవ్రతతో ధ్వని వెలువడటం ఇబ్బందికరంగా మారింది. దీనికి పరిష్కారాన్ని అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు.. ఈసారి కింగ్‌ఫిషర్‌ పక్షి మార్గం చూపింది.  వేగంగా ప్రయాణించేందుకు దాని ముక్కు ఆకృతి వీలుగా ఉందని వారు గుర్తించారు. ఈ మేరకు బుల్లెట్‌ రైలు ముందు భాగాన్ని కాస్త సాగి ఉండేలా తీర్చిదిద్దారు. రెండు పక్కలా త్రికోణాకారంలో ఉబ్బెత్తు భాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్పులతో గాలి నిరోధకత తట్టుకోవడం, ధ్వనిని తగ్గించడం వీలైంది. 

పక్షులు చూపిన మార్గంలో.. 
గుడ్లగూబ, కింగ్‌ఫిషర్‌ పక్షుల స్ఫూర్తితో, మరికొంత టెక్నాలజీ జోడించి చేసిన మార్పులతో.. 1997లో షింకణ్‌సెన్‌–500 సిరీస్‌ రైలును నడిపారు. అది గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. నాటికి ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచిన రైలుగా ఇది రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆ రైలు నుంచి పరిమితి మేరకు 70 డెసిబెల్స్‌ స్థాయిలోనే ధ్వని వెలువడటం గమనార్హం.  అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ మార్పులతో రైలు తయారీ, విద్యుత్‌ వినియోగం, నిర్వహణ ఖర్చులు కూడా తగ్గాయి. తర్వాత జపాన్‌ స్ఫూర్తితో చైనా, పలు యూరోపియన్‌ దేశాలు బుల్లెట్‌ ట్రైన్లను అభివృద్ధి చేశాయి.  

మరిన్ని వార్తలు